ఆదిలాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాల్సిన సీసీఐ కార్పొరేట్ సంస్థలా వ్యవహరిస్తూ రైతులను నష్టాలకు గురిచేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటాలుకు రూ.8110 ప్రకటించింది. ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల క్రితం పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాగా.. సీసీఐ తేమ శాతం ఎక్కువ ఉందంటూ మెలికలు పెట్టింది. రైతులు మార్కెట్ యార్డులో రోజుల తరబడి పత్తిని ఎండపెట్టి తేమ శాతం తగ్గిన తర్వాత విక్రయించారు. చాలా మంది రైతులు ప్రైవేటు వ్యాపారులకు క్వింటాలుకు రూ.1400 తక్కువకు విక్రయించి నష్టపోయారు. సీసీఐ ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే సేకరిస్తున్నది. వ్యవసాయ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే 12 క్వింటాళ్ల వరకు కొంటామని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నా క్షేతస్థాయిలో అమలు కావడంలేదు.
ఇన్సెంటివ్ ఇవ్వడం లేదు..
ఆదిలాబాద్ జిల్లాలో పది రోజులుగా ఎండలు కొడుతుండడంతో పత్తిలో తేమ శాతం తగ్గింది. 8 శాతం తేమ ఉంటే మద్దతు ధర రూ.8110 చెల్లిస్తున్న సీసీఐ క్రమంగా కోతలు విధిస్తున్నది. 9 శాతం ఉంటే రూ.81 తగ్గించి రూ.8029తో.. 10 శాతం ఉంటే రూ.7948.. 11 శాతం ఉంటే రూ.243 తగ్గించి రూ.7867 తో.. 12 శాతం తేమ ఉంటే రూ.324 తగ్గించి రూ.7786తో చెల్లిస్తున్నారు. సీసీఐ నిబంధనల ప్రకారం తేమ శాతం 8 కంటే తక్కువగా ఉంటే ఒక్కో పాయింట్‌కు మద్దతు ధరలో రూ.81 కలిపి చెల్లించాలి. 7 శాతం తేమ వస్తే రూ.8191, 6 శాతం తేమ వస్తే రూ.8272 ఇన్సెంటివ్ (ప్రోత్సాహకం) చెల్లించాలి. ఆదిలాబాద్‌తోపాటు ఇతర మార్కెట్ యార్డులకు రైతులు తీసుకొస్తున్న పత్తిలో 6 నుంచి 7 శాతం తేమ వస్తున్నా మద్దతు ధరలో అదనంగా ఇన్సెంటివ్ డబ్బులు కలిపి ఇవ్వడంలేదు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు.
పింజ పొడువు పేరిట రూ.50 కోత
సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించిన నెల రోజుల్లో మద్దతు ధరను తగ్గించింది. వానకాలంలో రైతులు 4.31 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేయగా 35 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సీసీఐ ఇప్పటివరకు 1.95 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేసింది. ఇందులో మద్దతు ధర క్వింటాలుకు రూ.8110 దక్కిన రైతుల 25 శాతం. దూదిలో పింజ పొడువు రావడం లేదంటూ సీసీఐ అధికారులు నేటి నుంచి రూ.50 తగ్గించి, క్వింటాలుకు రూ.8060తో కొనుగోలు చేయనున్నారు. కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు పడకుండా లోకల్ మానిటరింగ్ టీంలను ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించిన టీంలు ఎక్కడా కనిపించడంలేదు.
6 శాతం తేమ వచ్చినా 8 అని రాశారు
నేను 22 క్వింటాళ్ల పత్తిని ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చా. ఒకటో నంబర్ కాంటా వద్ద తేమను పరిశీలించారు. మూడు చోట్ల పరిశీలించగా 6 శాతం తేమ రాగా సిబ్బంది 8 శాతం రాశారు. 6 శాతం తేమ వస్తే నాకు క్వింటాలుకు మద్దతు ధర కంటే అదనంగా రూ.162 కలిపి రూ.8272 చెల్లించాలి. 8 శాతం తేమ రావడంతో రూ.8110 చెల్లించారు. పత్తిలో పింజ పొడువు రావడం లేదని ధర తగ్గిస్తున్న సీసీఐ అధికారులు తేమ 8 శాతం కంటే తక్కువ వస్తే ఎక్కువ ధర చెల్లించడం లేదు. ఈ విషయం ఎవరికి చెప్పాలో తెలియడంలేదు.
– భగవాండ్లు, రైతు, పిప్పరికుంట, భీంపూర్ మండలం