హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో బాంబులు పెట్టారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను పిటిషన్‌గా తీసుకొని సీబీఐతో విచారణ చేయించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతున్నట్టు తెలిపారు.
శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిందని, వారు అధికారంలో ఉన్నప్పుడే అది కూలిందని, అయితే ఆ చెడ్డ పేరును కాంగ్రెస్ పార్టీ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు నిర్మిస్తుందని, ప్రాజెక్ట్‌లు కూలగొట్టే చరిత్ర లేదని అన్నారు. కేటీఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.