Panchyat Elections | కల్పించేదాకా ముందుకెళ్లలేని పరిస్థితి కులగణన రీసర్వేతో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా లేవని తేలిపోయింది. ఈ నెల 16 నుంచి 28 వరకు మళ్లీ సర్వే నిర్వహిస్తామని చెప్తున్నది. మార్చి 8 వరకు ఆ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత వరుసగా వార్షిక పరీక్షలు జరగనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి నిండు ఎండాకాలం రానున్నది. పైగా 42శాతం కోటాకు చట్టబద్ధతపై స్పష్టత రావాల్సి ఉన్నది. సమ్మర్ సమస్యల నేపథ్యంలో జూలై వరకు ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం లేదని తెలుస్తున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జూలై దాకా లేనట్టేనని స్పష్టమవుతున్నది. కులగణనలో పాల్గొననివారి వివరాలు తిరిగి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎన్నికల వాయిదా అనివార్యమని తెలుస్తున్నది. రాష్ట్రంలో పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ పాలకవర్గాల పదవీకాలం ఇప్పటికే ముగిసింది. వాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నది. ఈ నెలలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఎన్నికల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లను డెడికేటెడ్ కమిషన్ స్థిరీకరించాల్సి ఉన్నది. వాస్తవంగా కులగణన నిర్వహించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రె స్ హామీ ఇచ్చింది. సర్వే నిర్వహించడంతోపాటు, ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదికను కూడా ప్రభుత్వం తెప్పించుకున్నది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకు డెడికేటెడ్ కమిషన్ 50 శాతానికి లోబడే రిజర్వేషన్లను ఖరారు చేసినట్టు సమాచారం.
ఇప్పటికే కులగణన సర్వే గణాంకాలపై కులసంఘాలు, మేధావులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇండ్లకు ఇండ్లనే మినహాయించారని విమర్శిస్తున్నారు. వాస్తవ పరిస్థితులకు, సర్వే గణాంకాలకు ఏమాత్రం పొంతన లేదని నిప్పులు చెరుగుతున్నారు. ప్రభుత్వమే 3.1శాతం (16లక్షల) జనాభా సర్వేలో పాల్గొనలేదని అధికారికంగా వెల్లడించింది. కానీ నాలుగింతలకు పైగా జనాభా సర్వేలో పాల్గొనలేదని తెలుస్తున్నది. అసమగ్రంగా సేకరించిన వివరాలు, రూపొందించిన గణాంకాల ఆధారంగా ఖరారు చేస్తే అవి చట్టం ముందు నిలబడే ప్రసక్తి లేదని ‘నమస్తే తెలంగాణ’ మొదటి నుంచీ చెప్తూవస్తున్నది. 42 శాతం రిజర్వేషన్ల సంగతేమోగాని ప్రస్తుతమున్న రిజర్వేషన్లకే ఎసరు వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నది. అదీగాక సుప్రీంకోర్టు నిబంధనల మేరకు స్థానికసంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. అంతకంటే ఎక్కువశాతం రిజర్వేషన్లను కల్పించాలంటే ప్రామాణికమైన గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసి, చట్టబద్ధత కల్పించి, కేంద్రం ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ పలుమార్లు నిపుణుల అభిప్రాయాలతో సహా వెల్లడించింది.
కులగణనపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో రీ సర్వే చేయాలని బీఆర్ఎస్తోపాటు, బీసీ సంఘాలు, ప్రజాసంఘాలు, కులసంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చి రీ సర్వే చేస్తామని ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కులగణన వివరాల నమోదుకు అవకాశం కల్పిస్తామని, ఈ గణాంకాలపై మార్చి మొదటి వారంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చిస్తామని చెప్పింది. అప్పుడే 42 శాతం రిజర్వేషన్లపై శాసనసభలో బిల్లుపెట్టి ఆమోదించి చట్టబద్ధత కల్పిస్తామని, పార్లమెంట్లో కూడా ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించింది. కేంద్రం ఆమోదంతో రిజర్వేషన్ల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్లే పరిస్థితి ఉన్నది. దీనికి తోడు వచ్చే ఎండకాలంలో గ్రామాల్లో ప్రతికూల పరిస్థితులు ఉంటాయన్న భావనకు ప్రభుత్వ పెద్దలు రావడంతో ఎన్నికలపై ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలో జూలై తర్వాతే ఎన్నికలు ఉండొచ్చన్న అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
కులగణన ఆధారంగా స్థానిక ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత ఇప్పట్లో ఎన్నికలు ఉండబోవని వెల్లడి నమస్తే తెలంగాణ చెప్పిందే నిజమైంది. లోపభూయిష్టంగా నిర్వహించిన సర్వేకు చట్టబద్ధత కష్టమేనని, స్థానిక ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని పేర్కొంటూ వరుస కథనాలు ప్రచురించింది. బీసీ సంఘాలను కదిలించింది. కులగణన రీసర్వేకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో నమస్తే ప్రయత్నాన్ని సామాజిక వేత్తలు, బీసీ సంఘాల నేతలు ప్రశంసిస్తున్నారు.
nt article onPanchayat Elections
Read More : Panchayat Elections | జూన్‌లోనే పంచాయతీ ఎన్నికలు.. డైలామాలో కాంగ్రెస్ సర్కార్!