Panchayat Elections | హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం డైలమాలో పడ్డట్టు తెలుస్తున్నది. ఇటీవల జరిగిన గ్రామసభల్లో జనం నుంచి వచ్చిన తీవ్ర నిరసనలతో వెనక్కి తగ్గిందని సమాచారం. ప్రతికూల ఫలితాలు తప్పవని భావిస్తున్నదని, పథకాల అమలు తర్వాతే నిర్వహించేందుకు సిద్ధమైందని తెలిసింది. ఈ మేరకు వచ్చే జూన్ లేదా జూలైలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎ
న్నికల జరిపితే ఎదురయ్యే పరిణామాలు, వాయిదా వేస్తే తలెత్తే ఇబ్బందులపై అధికార పార్టీ పెద్దలు తాజాగా చర్చోపచర్చలు చేస్తున్నట్టు వినికిడి. కొంతకాలంగా త్వరలోనే స్థానిక ఎన్నికలంటూ సీఎంతోపాటు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పదే పదే ఊదరగొట్టారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు సమాచారం. గ్రామసభల్లో అనేకచోట్ల ప్రజల నిలదీతలు, డెడికేషన్ కమిషన్ నివేదికపై ముందుకెళ్లే విషయంలో అయోమయం నెలకొనడంతో సర్కారు సందిగ్ధంలో పడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రతికూల ఫలితాలు వస్తాయనే భయంతోనే అధికార పక్షం వెనుకడుగు వేస్తున్నదని భావిస్తున్నారు. జనవరి 26న ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేసిన తర్వాతే ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే పథకాల అమలుకు మార్చి 31 వరకు గడువు విధించిందని పేర్కొంటున్నారు.
మార్చి, ఏప్రిల్‌లో పరీక్షలు
మార్చి 31 తర్వాత ఎన్నికలు నిర్వహించాలనుకున్నా సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమై ఏప్రిలో 4 వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఇంటర్, డిగ్రీ పరీక్షలు, మే నెలలో వివిధ ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. మరోవైపు ఎండాకాలంలో సహజంగానే నీటి ఎద్దడి, కరెంట్ కోతలు ఇతర సమస్యలు ప్రతిపక్షాలకు ప్రధాస్ర్తాలుగా మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మే తర్వాతే అంటే జూన్, జూలైలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులే కనిపిస్తున్నాయి.
అధికారపక్షంలో నిస్తేజం
స్థానిక ఎన్నికల నిర్వహణపై అధికార కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యంగా ఈ విషయంలో మంత్రుల మధ్యే సఖ్యత లేదని చెప్తున్నారు. పథకాల అమలు ఊపులోనే ఎన్నికలకు వెళ్తే ఫలితం ఉంటుందని కొందరు పట్టుబడుతున్నారని తెలుస్తున్నది. లేదంటే పార్టీ క్యాడర్లో నిస్తేజం అలుముకుంటుందని వారంటున్నారని వినికిడి. సంక్షేమ పథకాలు అందకపోవడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఈ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా తీవ్రంగా నష్టం జరుగుతుందని మరికొందరు చెప్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం అయోమయంలో పడ్డట్టు తెలుస్తున్నది.
జోష్‌లో ప్రధాన ప్రతిపక్షం
అధికార కాంగ్రెస్‌లో నిరుత్సాహం కనిపిస్తుండగా, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల నుంచి వెంటనే తేరుకొని పార్టీ నేతలు కార్యక్షేత్రంలోకి అడుగుపెట్టారు. నిత్యం జనంతో మమేకమవుతూ వారి సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, కవిత నాయకత్వంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, హామీల అమలుపై నిత్యం నిలదీస్తున్నారు. ముఖ్యంగా రైతుధర్నాల పేరిట అన్నదాతలకు భరోసానిస్తూ పార్టీ ముందుకెళ్తున్నది. పార్టీ ఏ పిలుపునిచ్చినా రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తుండటంతో అటు క్యాడర్లో, లీడర్లలో జోష్ కనిపిస్తున్నది. వెరసీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నది.