Caste Census | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 13 రోజులపాటు మొక్కుబడిగా సాగిన కులగణన రీసర్వే శుక్రవారం నాటితో ముగిసింది. మూడంచెల విధానంలో రెండో విడత చేపట్టిన ఈ ప్రక్రియకు ప్రజల నుంచి స్పందన కరువైంది. తొలి విడతలో మిగిలిన సుమారు 3.5 లక్షల కుటుంబాలకు గాను కేవలం 15 వేల ఇండ్ల వివరాలనే సేకరించడం సర్వే తీరుకు అద్దం పడుతున్నది. దీంతో ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై బీసీ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు ప్రభుత్వం నిరుడు నవంబర్‌లో ఆర్థిక, సామాజిక, రాజకీయ వివరాల సేకరణ పేరిట కులగణన సర్వేను ప్రారంభించింది. మూడు నెలల్లో సుమారు రాష్ట్రంలోని 3.56 కోట్ల మంది అంటే 97.1 శాతం వివరాలు సేకరించినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఇంకా సుమారు 16 లక్షల మంది సర్వేలో పాలుపంచుకోలేదని వెల్లడించింది. ఈ మేరకు నివేదికను ఫిబ్రవరి 4న నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టింది. సర్వే నిర్వహించిన తీరు అసమగ్రంగా ఉన్నదని, బీసీ జనాభాను ఉద్దేశపూర్వకంగానే తగ్గించి చూపిందని ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు మండిపడ్డాయి. సర్వేలోనే లోపాలను సోదాహరణంగా ఎత్తిచూపాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 28 వరకు రీసర్వే చేపట్టింది.
మూడంచెల్లో ప్రక్రియ
మొదట ఎన్యుమరేటర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. రెండో విడుత మాత్రం ఇందుకు భిన్నంగా మూడంచెల పద్ధతిని అవలంబించారు. 040-21111111 కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నంబర్‌కు ఫోన్ చేసిన వారి ఇండ్లకు వెళ్లి వివరాలు తీసుకున్నారు. మండల కేంద్రాల్లోని ఎంపీడీవో ఆఫీసుల్లో, ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకొనే వెసులుబాటు కల్పించారు. అయినా ఆశించిన స్పందన రాలేదని అధికారులే చెప్తున్నారు. కేవలం 15 వేల కుటుంబాల వివరాలనే సేకరించామని పేర్కొంటున్నారు.
బీసీ సంఘాల ఆగ్రహం
ప్రభుత్వం చేపట్టిన కులగణన రీసర్వే తీరుపైనా బీసీ సంఘాలు భగ్గుమన్నాయి. గతంలో వివరాలు ఇవ్వని ఇండ్లకు ఎన్యుమరేటర్లను పంపించకుండా మూడంచెల విధానంలో నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్నే తప్పుబడుతున్నారు.