హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే చేపట్టిన సిబ్బందికి నేటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పారితోషికం చెల్లించలేదు. రోజువారీ లక్ష్యాలు నిర్దేశించి సర్వే పూర్తిచేసుకున్న సర్కారు.. గౌరవ వేతనం చెల్లించకుండా తాత్సారం చేస్తున్నది. ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు గౌరవ వేతనం కోసం ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఒకటి రెండు జిల్లాల్లో సిబ్బందికి పారితోషికం అందగా, మిగిలిన జిల్లాల్లో అధికారుల చుట్టూ తిరిగి వేసారిన ఎన్యుమరేటర్లు ఆయా కలెక్టరేట్ల వద్ద నిరసనలు తెలిపారు. కలెక్టర్లకు వినతిపత్రాలు కూడా సమర్పించారు. అయినా, నేటికీ గౌరవ వేతనం దక్కలేదని మండిపడ్డారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణనను కాంగ్రెస్ ప్రభుత్వం నిరుడు నవంబర్ 6 నుంచి మొదలుపెట్టి ఆ నెలాఖరు వరకు పూర్తిచేసింది. సర్వే సమయంలో ఎన్యుమరేటర్లు ఇంటింటికీ తిరిగి సమాచారం సేకరించారు.
కుటుంబ సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,16,14,349 ఇండ్లను ఎన్యుమరేటర్లు గుర్తించారు. 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, 10,000 మంది సూపర్వైజర్లు పనిచేశారు. ఎన్యుమరేటర్లకు రూ.10 వేలు, సూపర్వైజర్లకు రూ.12 వేలు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ.6వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వదు.