KTR | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు నిత్యం ప్రయతిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి సర్కార్ కక్ష పెంచుకున్నదా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఆయనను నిలువరించేందుకు అడ్డదారులు వెతుకుతున్నదా? ఎలాగైనా కేటీఆర్‌ను అరెస్ట్ చేసి ఆయనను జైల్లో వేసేందుకు కంక ణం కట్టుకున్నదా? కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ చట్ట వ్యతిరేకంగానైనా అరెస్ట్ చేయాలనే కుట్ర మొదలు పెట్టిందా? అందుకే కేటీఆర్ కేవలం నిరసనలు తెలిపినా సరే కేసులు పెడుతున్నదా? ఒకే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్స్టేషన్లలో కేసులు నమోదు చేయించడమే కాకుండా ఇలా అక్రమ కేసులు నమోదు చేస్తూ కేటీఆర్‌ను వేధించాలని చూస్తున్నదా?’ అంటే రాజకీయ విశ్లేషకులు ‘అవును’ అనే సమాధానమిస్తున్నారు. కేటీఆర్‌ను ఎలాగైనా అరెస్ట్ చేయాలనే పనిలోనే సీఎం రేవంత్‌రెడ్డి నిమగ్నమైనట్టు కేటీఆర్‌పై నమోదవుతున్న కేసులే చెప్తున్నాయి. అమరవీరుల స్మృతి చిహ్నం ముందు తెలంగాణ కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్నతో కేటీఆర్ జరిపిన ఇష్టాగోష్ఠి (ప్రత్యేక ఇంటర్వ్యూగా) అన్ని చానళ్లు టెలికాస్ట్ చేశాయి. అమరవీరుల స్మృతి చిహ్నం ముందు ఇష్టాగోష్ఠి నిర్వహించినందుకు కేటీఆర్‌పై సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేయించడమే కాకుండా.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి పోలీస్ స్టేషన్లో కేసుల నమోదు పరంపర కొనసాగిస్తున్నది. బాధ్యతాయుత ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సర్కార్ అడ్డదారులు వెతుకుతున్నదని, అధికార, అనధికార సైన్యాన్ని మోహరించి ఎలాగైనా.. కేటీఆర్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని రేవంత్ సర్కార్ అహర్నిశలూ శ్రమిస్తున్నదనే చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తున్నది. చట్ట వ్యతిరేకంగానైనా కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలనే కుట్రలు కొనసాగుతున్నట్టు తెలుస్తున్నది. కేటీఆర్ ఎక్కడ నిరసన తెలిపితే అక్కడ కేసు పెట్టాలె అన్న ధోరణితో సర్కార్ వ్యవహరిస్తున్నదని, ఇందుకు ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసులే సాక్ష్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.
‘ఓటుకు నోటు కేసు’లో రూ. 50 లక్షలతో కెమెరాల ముందు అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం జైల్లో పెట్టిన విషయం తెలిసిందే. అందుకు ప్రతీకారంగా ఎలాగైనా కేసీఆర్ కుటుంబంలో ఒకరిని.. అందులో కేటీఆర్‌ను జైల్లో వేసి తన రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటానని రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందురోజు బాహాటంగానే తన సన్నిహితులతో చెప్పినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కేటీఆర్‌ను జైలుకు పంపిస్తానంటూ సమయం దొరికినప్పుడల్లా ప్రకటిస్తూనే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటు అసెంబ్లీలో ఇటు ప్రజాక్షేత్రంలో కేటీఆర్ తన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెడుతున్నారని, కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యాలను నిత్యం ఎండగడుతూనే ఉన్నారని, వీటికితోడు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల అవినీతి బాగోతాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతున్నారని, మూసీ, అమృత్ టెండర్లు, కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టు, ఫార్మా విలేజ్ పేరిట భూదందాలు, ఫార్మా సిటీ భూముల్లో ఫోర్త్‌సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా ప్రయత్నాలపై తన వద్దనున్న ఆధారాలను కేటీఆర్ ప్రజల ముందు పెడుతున్నారని, అందుకే సీఎం రేవంత్‌రెడ్డిలో అసహనం పెరిగిపోయిందని చెప్తున్నారు. మరోవైపు కేటీఆర్ తమకు కొరకరాని కొయ్యగా, కంట్లో నలుసుగా తయారయ్యారని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు సైతం చెప్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్‌ను నిలువరించాలంటే అరెస్టు ఒక్కటే దారిగా రేవంత్‌రెడ్డికి కనిపిస్తున్నదని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారంటూ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ కేటీఆర్‌పై కేసులు నమోదవుతుండడం గమనార్హం. అమరవీరుల స్తూపం వద్ద ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా దీనిపై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో, మేడిగడ్డలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వాడారని మహదేవ్పూర్ పోలీస్‌స్టేషన్‌లో, ముఖ్యమంత్రిని ‘చీప్ మినిస్టర్’ అంటూ సంబోధించారని సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో, మూసీ ప్రాజెక్ట్‌పై చేసిన వ్యాఖ్యలకు ఉట్నూరు పోలీస్ స్టేషన్లో, చార్మినార్ వద్ద నిరసన తెలిపినందుకు చార్మినార్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఇందులో చార్మినార్ పోలీస్ స్టేషన్లో కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షాపై కేసు నమోదు చేసినా ఆధారాలు లేవని ఆ కేసును కొట్టివేశారు. కానీ కేటీఆర్‌పై కేసును మాత్రం కొనసాగిస్తున్నారు.
కేటీఆర్‌ను అరెస్ట్ చేయాలన్న ఉత్సాహంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విస్మరిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాపాలన అని గొప్పలు చెప్పే రేవంత్‌రెడ్డి సరార్ కేటీఆర్ ప్రశ్నించటాన్ని తట్టుకోలేకపోతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వేధింపుల్లో భాగంగానే న్యాయస్థానాల్లో నిలవలేని, పసలేని కేసులను కేటీఆర్‌పై నమోదు చేస్తున్నారని చెప్తున్నారు. ఒకే అంశానికి సంబంధించి పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేయకూడదనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పట్టించుకోవటం లేదని విమర్శిస్తున్నారు. కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే చట్టాన్ని తుంగలో తొకుతూ కేసులు పెడుతున్నారని, ఐటీ యాక్ట్‌ను కూడా దుర్వినియోగం చేస్తూ కేటీఆర్‌పై కేసులు పెట్టేందుకు తహతహలాడుతున్నారని స్పష్టంచేస్తున్నారు.
ఆరు గ్యారెంటీల అమలు, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైన రేవంత్‌రెడ్డి సరార్ డైవర్షన్ పాలి‘ట్రిక్స్’ చేస్తున్నదని మొదటి నుంచీ విమర్శలు వస్తున్నాయి. కేటీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయటం, ఆయనకు అవినీతి బురద అంటించటం ద్వారా కేటీఆర్ లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, పీసీసీ ప్రెసిడెంట్ వరకు అంతా కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ విష్లేషకులు చెప్తున్నారు.
అక్రమంగా కేసులు పెట్టి అణచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. కేటీఆర్ మరింత ఉత్సాహంతో ప్రజల తరఫున పోరాటం చేస్తున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నాయి. కేసులతో తనను భయపెట్టాలని చూస్తే అంతకన్నా మూర్ఖత్వం మరోటి ఉండదని కేటీఆర్ ఈ విషయంలో తెగేసి చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. ప్రజల కోసం చేసే పోరాటంలో సంతోషంగా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని, ఒక్కసారి కాదు అవసరమైతే వందసార్లు అయినా తాను జైలుకు వెళ్లటానికి సిద్ధమని కేటీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్‌రెడ్డి చౌకబారు రాజకీయాలకు పాల్పడినంత మాత్రాన ప్రజల పక్షాన తన గొంతును వినిపించక మాననని, తన ప్రశ్నను సంధించకుండా ఆపనని ఆయన కరాఖండిగా చెప్తున్నారు. తనపై నమోదైన మొత్తం కేసులపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి కేటీఆర్ లేఖ రాసినా డీజీపీ కార్యాలయం నుంచి స్పందన లేకపోవటం గమనార్హం.
ప్రతీకార రాజకీయాల సంసృతిని రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిననాటి నుంచే మొదలుపెట్టారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తామంటూ ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ ప్రెసిడెంట్ బహిరంగ ప్రకటనలు చేయటమే అందుకు నిదర్శనమని పేర్కొంటున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సియోల్ వేదికగా ‘బాంబులు పేలుతాయి’ అని, తొర్రూరు వేదికగా ‘పేలేది ఆటంబాంబు.. అణుబాంబు’ అని కేటీఆర్ అరెస్టుపై తన కుతూహలాన్ని చాటుకుంటూనే ఉన్నారని, బీజేపీ నేతలు కూడా కేటీఆర్‌నే టార్గెట్ చేశారని చెప్తున్నాయి. ప్రతిపక్షంగా అధికార పార్టీపై పోరాటం చేయాలనే స్పృహను మరిచి కేటీఆర్‌పైనే బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారని, ఆయన అరెస్ట్ ఖాయమంటూ వాళ్లు కూడా ప్రకటనలిస్తున్నారని, బీఆర్ఎస్ను అణచివేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని గులాబీ శ్రేణులు సైతం మండిపడుతున్నాయి.
చట్టం దృష్టిలో తమకు అందరూ సమానమేనని బయటికి చెప్తూ అది నిజమేనని నమ్మించేందుకు అప్పుడప్పుడూ బీజేపీపై విమర్శలు చేస్తున్నారే తప్ప కేటీఆర్, బీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని గులాబీ శ్రేణులు చెప్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ చీకటి స్నేహం కొనసాగుతున్నదని, చార్మినార్ వద్ద నిరసన వ్యక్తం చేసిన అంశానికి సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మీద సాక్ష్యాధారాలు లేవని ఎఫ్ఐఆర్ను కూడా కొట్టివేశారని, ఇదే కేసులో కేటీఆర్‌పై నమోదైన కేసును మాత్రం కొనసాగిస్తున్నారని, బీజేపీ, కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ తీరుకు ఈ ఒక్క ఉదాహరణ చాలని స్పష్టంచేస్తున్నాయి.