వేములవాడ, సెప్టెంబర్ 1: వేములవాడ నియోజకవర్గంలో మరో అరాచక పర్వం చోటుచేసుకున్నది. గతంలో యూరియా దొరకడం లేదని మీడియాకు చెప్పిన రైతులతో సారీ చెప్పించిన అధికార పార్టీ నాయకులు.. యూరియా కోసం రైతులకు అండగా నిలబడిన బీఆర్ఎస్ నాయకులపై ఏకంగా కేసులు పెట్టడం కలకలం రేపింది. యూరియాకోసం గంటల తరబడి లైన్లో ఉన్న అన్నదాతల దాహం తీర్చేందుకు వాటర్ బాటిళ్లు ఇచ్చిన బీఆర్ఎస్ నాయకులను అభినందించాల్సింది పోయి రైతులను రెచ్చగొడుతున్నారంటూ.. కేసులు చేయడం విమర్శలకు తావిచ్చింది.
రాజన్న సిరిసిల్ల వేములవాడలోని రెండు ఎరువుల దుకాణాలకు రైతులు సోమవారం ఉదయం 6 గంటలకే చేరుకున్నారు. సాయంత్రం అయినా బస్తా యూరియా దొరకకపోవడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. బీఆర్ఎస్ నాయకులు మద్దతుగా నిలిచి, ఏవో సాయికిరణ్‌తో మాట్లాడారు. ఎస్సై రామ్మోహన్ రైతులను రెచ్చగొడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలను పీఎస్‌కు తరలించారు. వేములవాడ రూరల్ మండల అధ్యక్షుడు రవి, సెస్ మాజీ డైరెక్టర్ రాజు, మాజీ కౌన్సిలర్లు విజయ్, కుమార్, నాయకులు పాషా, మధు, సాయిపై కేసులు నమోదుచేశారు. బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడంపై వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహాహరావు మండిపడ్డారు. ఎటువంటి కేసులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
వేములవాడలో వ్యవసాయ అధికారి సాయికిరణ్‌కు దండం పెట్టి యూరియా ఇప్పించండి అంటూ వేడుకుంటున్న మహిళా రైతు