ములుగు, మే 7(నమస్తే తెలంగాణ): ‘పసి ప్రాణమా.. పోనీ..!’ శీర్షికన ఏప్రిల్ 19వ తేదీన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై కాంగ్రెస్ నేతలు కన్నెర్ర చేశారు. ఏప్రిల్ 18న ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖానలో పసికందు మృతి చెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ జాతీయ రహదారిపై కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అదే రహదారి వెంట రోడ్డుషో నిర్వహిస్తున్న మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తమకు జరిగిన అన్యాయాన్ని తీసుకెళ్లేందుకు బాధాతప్త హృదయులైన ఆ కుటుంబసభ్యులు ఆ పసిపాప మృతదేహాన్ని పైకెత్తి చూపించారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని ఓదార్చి, మానవీయతను చాటుకోవాల్సిన మంత్రులు అదేమీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. జరిగిన ఈ యదార్థ ఘటనను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. పసిబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రుల దుఃఖానికి అక్షరరూపమిచ్చింది.
ఇదే కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. ఈ వార్త రాసిన ‘నమస్తే తెలంగాణ’ ములుగు జిల్లా ఇన్చార్జి బోయినపల్లి శ్రీధర్‌రావుపై కేసు పెట్టారు. ములుగుకు చెందిన కాంగ్రె స్ నాయకుడు బోడ రఘు ఫిర్యాదు మేరకు వార్త ప్రచురితమైన రోజు (ఏప్రిల్ 19)న సెక్షన్-353(2) బీఎన్ఎస్ఎస్ కింద ములుగు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు సదరు కాం గ్రెస్ నాయకుడు ఈ కేసు పెట్టినట్టు తెలిసింది. అయితే, కేసు నమోదైన 18 రోజుల అనంతరం బుధవారం.. వార్త రాసిన బోయినపల్లి శ్రీధర్‌రావుకు ములుగు పోలీసుస్టేషన్‌కు రావాలని స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు సూచించారు. దీంతో శ్రీధర్‌రావు న్యాయవాది మస్రగాని వినయ్‌కుమార్‌ను వెంట తీసుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ‘అండర్ సెక్షన్ 35(3) బీఎన్ఎస్ఎస్’ కింద కేసు నమోదైనట్టు తెలిపిన పోలీసులు ఆ మేరకు శ్రీధర్‌రావుకు నోటీసు అందజేశారు. ఆధార్ నంబర్ తీసుకొని వి వరాలు నమోదు చేసుకున్నారు. పసికందు మృతిచెందిన సమయంలో మంత్రులు మానవీయంగా స్పంది ంచి, బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోగా, ఆ కథనం రాసిన జర్నలిస్టుపై కాంగ్రెస్ నేతలు కేసు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.