హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక ఐటీ పారును ఏర్పాటు చేసేందుకు ‘క్యాపిటల్యాండ్’ కంపెనీ ముందుకొచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సింగపూర్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించిన ‘క్యాపిటల్యాండ్’.. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. సింగపూర్‌కు చెందిన ఈ కంపెనీ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచింది. ‘క్యాపిటల్యాండ్’ నిర్ణయాన్ని సీఎం స్వాగతించారు. ఆ కంపెనీ చేపట్టే కొత్త ఐటీ పారు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించటం ఆనందంగా ఉన్నదని ‘క్యాపిటల్యాండ్’ ఇండియా సీఈవో గౌరీశంకర్ నాగభూషణం పేర్కొన్నారు. బ్లూచిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలతోపాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఈ ఐటీ పారులో అందుబాటులో ఉంటాయని అధికారవర్గాలు తెలిపాయి.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, క్యాపిటల్యాండ్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘క్యాపిటల్యాండ్’ ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెక్ పార్ (ఐటీపీహెచ్)తోపాటు అవాన్స్ హైదరాబాద్, సైబర్ పెర్ల్ పారులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డాటా సెంటర్ ఈ ఏడాదిలోనే అందుబాటులోకి రానున్నది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి ఏర్పాటు కానున్నది.
సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం 3 రోజుల సింగపూర్ పర్యటన ఆదివారంతో ముగిసింది. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారుల బృందం దావోస్ బయల్దేరి వెళ్లింది. సోమవారం నుంచి అకడ 4 రోజులపాటు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో వారు పాల్గొంటారు. సదస్సుపై రాష్ట్ర బృందం భారీ అంచనాలు పెట్టుకున్నది. చివరిరోజు సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి బృందం అకడి ప్రధాన వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ (ఎస్బీఎఫ్) ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్త్ బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్‌హిమ్‌న్‌తో చర్చలు జరిపింది. పెట్టుబడులకు అవకాశాలు, ప్రభుత్వ విధానాలు వివరించింది.