హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను (వీసీ) ఎంపికను చేపట్టే కీలకమైన సెర్చ్ కమిటీల కూర్పులో చిత్రాలు వెలుగుచూస్తున్నాయి. వీసీ పోస్టుకు పోటీపడే వారిని వర్సిటీ పాలకమండలి ఈసీ నామినీల ఎంపికకు పరిశీలిస్తున్నారు. దీంతో వీసీ పోస్టుకు దరఖాస్తు చేసిన వారే.. ఈసీ నామినీగా ఎంపికయ్యే అవకాశాలున్నాయి. ఈసీ నామినీగా ఎంపికైతే వీసీ పోస్టుకు పోటీ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని కొందరు ప్రొఫెసర్లు మదనపడుతున్నారు. శాతవాహన వర్సిటీ వీసీ పోస్టుకు పోటీపడుతున్న ఓ సీనియర్ ప్రొఫెసర్ పేరును సెర్చ్ కమిటీలో అదే వర్సిటీ పాలకమండలి నామినీగా ఎంపికచేసేందుకు పరిశీలిస్తున్నారు. దీంతో సదరు ప్రొఫెసర్ పాలకమండలి నామినీగా ఉండటమా? లేక వీసీ పోస్టుకు పోటీపడటమా? అన్నది తేల్చుకోలేకపోతున్నారు.
దీనిపట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసీల దరఖాస్తులను పరిశీలించే (స్క్రూటినీ) మరో ప్రొఫెసర్ జేఎన్టీయూ వీసీ పోస్టుకు పోటీపడుతున్నారు. దీంతో ఆయన తన దరఖాస్తును తానే పరిశీలించుకోవాల్సి ఉంటుంది. దీనిపైనా సదరు ప్రొఫెసర్ దేనికి ప్రాధాన్యమివ్వాలని తర్జనభర్జనలు పడుతున్నారు. సెర్చ్ కమిటీల్లో వర్సిటీ పాలకమండలి నామినీల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వం ఇటీవలే చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం మంగళవారం శాతవాహన, ఓయూ, జేఎన్టీయూ వర్సిటీల పాలకమండలి సమావేశాలను హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. దీనికి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం హాజరయ్యారు. ఉస్మానియా ఈసీ నామినీలుగా ముగ్గురి పేర్లను ప్రతిపాదించారు. వీరిలో న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రసాద్, మరో ఇద్దరు ఉన్నట్టు తెలిసింది.
బుధవారం తెలంగాణ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, కాకతీయ పాలకమండళ్లు భేటీ కానున్నాయి. వీటిలో ఈ రెండు వ ర్సిటీలకు ఈసీ నామినీలను ఎంపికచేయ ను న్నది. జేఎఫ్ఎఫ్ఏయూ పాలకమండలి భేటీ 9న నిర్వహణకు షెడ్యూల్‌ను రూపొందించారు.