హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): క్యాన్సర్ పేరు చెప్తేనే రోగులు హడలిపోతుంటారు. కుటుంబాలు అల్లాడిపోతుంటాయి. చికిత్సకు అయ్యే ఖర్చును తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. నిరుపేదలైతే ఇక వారి పరిస్థితి వర్ణనాతీతం. అలాంటివారిని ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్ అక్కున చేర్చుకొని పూర్తి ఉచితంగా చికిత్స అందించి, జీవితానికి భరోసా కల్పించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంఎన్‌జే హాస్పిటల్‌కు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకున్నది. భరోసా ఇచ్చి, సరైన చికిత్స అందించడంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలం కావడంతో వ్యాధిని గుర్తించడం దగ్గరి నుంచి చికిత్స అందించేదాకా రోగులు అవస్థలు పడాల్సి వస్తున్నది. చివరికి ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే పరిస్థితి లేకపోవడం దవాఖాన దుస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఒకప్పుడు కార్పొరేట్‌కు దీటుగా సేవలందించిన ఎంఎన్‌జే ఇప్పుడు ఈ స్థాయికి దిగజారిపోయిందంటూ రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్లో 750 పడకలు ఉన్నాయి. ప్రతిరోజు 700 నుంచి 750 మంది వరకు రోగులు ఓపీసేవలు పొందుతుంటారు. 600 మంది వరకు ఐపీసేవలు పొందుతుంటారు. ఇందులో బ్లడ్ క్యాన్సర్, లుకేమియా వంటి వాటితో బాధపడే చిన్నారులతోపాటు ఇతర అన్నిరకాల క్యాన్సర్ రోగులకు ఉచితంగా చికిత్స అందిస్తారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దవాఖానలో ఓపీ, ఐపీ సేవలకు అంతరాయం కలుగుతున్నది.
క్యాన్సర్ చికిత్సలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు అత్యంత కీలకం. రోగిలో క్యాన్సర్ ట్యూమర్స్ ఏ పరిమాణంలో ఉన్నాయి, అవి ఎక్కడి వరకు విస్తరించాయి, ఏ స్థాయిలో ఉన్నాయి తదితర అంశాలను క్షుణ్ణంగా గుర్తించాలి. ఆ నివేదికల ఆధారంగానే వైద్యులు వ్యాధి తీవ్రతను నిర్ధారించి, సరైన చికిత్స అందించేందుకు వీలు కలుగుతుంది. కానీ ఎంఎన్జేలో వ్యాధి నిర్ధారణకు సంబంధించిన పరీక్షలు చేసే సౌలభ్యం లేకపోవడంతో రోగుల పరిస్థితి అయోమయంగా మారింది. క్యాన్సర్ ట్యూమర్స్‌ను కచ్చితంగా గుర్తించేందుకు ‘కాంట్రాస్ట్ సీటీ స్కాన్’ చేస్తారు. సాధారణ సీటీ స్కాన్‌లో ట్యూమర్ కణాలు స్పష్టంగా కనిపించవు. అందుకే కచ్చితంగా కాంట్రాస్ట్ సీటీ స్కాన్ చేస్తారు. దీని ఖరీదు కూడా ఎక్కువే. అయితే నెల రోజులుగా ఎంఎన్జేలో ఐవీ కాంట్రాస్ట్ ఇంజక్షన్లు అందుబాటులో లేవు. దీంతో ఐవీ కాంట్రాస్ట్ పరీక్షలు రాయవద్దని వైద్యులకు సంబంధిత విభాగం హెచ్‌వోడీ సూచించినట్టు చెప్తున్నారు. దీంతో రోగులకు ఐవీ కాంట్రాస్ట్ సీటీ పరీక్షలను నిలిపివేశారు.
సాధారణ సీటీ స్కాన్ వల్ల పెద్ద ప్రయోజనం లేకపోవడంతో.. కొందరు రోగులు ఖరీదైనా కూడా ప్రైవేటులో కాంట్రాస్ట్ సీటీ స్కాన్ చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సాధారణ సీటీ స్కాన్‌తో పోల్చితే కాంట్రాస్ట్ సీటీ స్కాన్ ఖరీదు రెండుమూడు రెట్లు ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. దీంతో ఆర్థిక స్థోమత లేని రోగులు గత్యంతరం లేక ఎంఎన్‌జే దవాఖానలో సాధారణ సీటీ స్కాన్ పరీక్షలు చేయించుకుంటున్నారు. అయితే.. యంత్రాల కొరత కారణంగా సాధారణ సీటీ స్కాన్ చేయించుకోవాలన్నా వారాల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నదని రోగులు వాపోతున్నారు.
క్యాన్సర్ చికిత్సలో రేడియో థెరపీ అత్యంత ప్రధానం. ఈ చికిత్స కోసం ఎంఎన్జేలో మొత్తం 4 యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. పాత భవనంలో డీహెచ్ఎక్స్, 600-సీ, ట్రూ భీమ్ అనే మూడు రేడియో థెరపీ యంత్రాలు ఉండగా, మల్లెపల్లిలోని కొత్త భవనంలో మరొక యంత్రం ఉన్నది. ఒక్కో యంత్రంపై సగటున రోజుకు 60 నుంచి 80 మంది చొప్పున, ఈ నాలుగు యంత్రాల ద్వారా రోజూ షిఫ్టుల వారీగా 300 నుంచి 400 మంది రోగులకు రేడియో థెరపీ చికిత్స అందించేవారు. అయితే డీహెచ్ఎక్స్, 600-సీ యంత్రాలు కాలం చెల్లినవి కావడంతో తరచూ మొరాయిస్తున్నట్టు దవాఖాన సిబ్బంది చెప్తున్నారు.
గత 15 రోజుల నుంచి ఈ రెండు యంత్రాలు ఆగిపోయాయని తెలిపారు. దీంతో రోగులు రేడియేషన్ థెరపీ కోసం నిరీక్షించక తప్పడం లేదు. రెండు యంత్రాలు పనిచేయకపోవడంతో అందుబాటులో ఉన్న రెండు యంత్రాలపై ఒత్తిడి పెరిగిపోయిందని, దీంతో అవికూడా తరచూ మొరాయిస్తున్నట్టు సిబ్బంది వాపోతున్నారు. డీహెచ్ఎక్స్, 600-సీ రేడియో థెరపీ యంత్రాల కాలపరిమితి ముగిసిందని, సంబంధిత కంపెనీ అనేకసార్లు స్పష్టంగా చెప్పినా ఎంఎన్‌జే దవాఖాన పాలనా యంత్రాంగం పట్టించుకోవడం లేదు.
సర్జికల్ అంకాలజీ విభాగంలో రోగికి ఆపరేషన్ చేసిన తర్వాత ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తారు. ఈ క్రమంలో రోగి రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను పర్యవేక్షించేందుకు ఆర్టరియల్ బ్లడ్ గ్యాస్ ఎనాలసిస్(ఏబీజీ) యంత్రాన్ని వినియోగిస్తారు. ఈ ప్రక్రియలో రోగి రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను మానిటర్లో చూస్తూ ఆక్సిజన్‌ను అందిస్తారు. అలా చూడాలంటే ఏబీజీ కార్డును ఆయంత్రంలో వినియోగించాల్సి ఉంటుంది. కానీ ఎంఎన్జేలో కొన్నిరోజులుగా ఏబీజీకార్డులు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు అంచనా మీదే ఆక్సిజన్ అందిస్తున్నారు.
ఖరీదైన క్యాన్సర్ చికిత్సను నిరుపేద రోగులకు పూర్తి ఉచితంగా అందించి, వారి ప్రాణాలు కాపాడాలని కేసీఆర్ ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రాష్ట్రంలోని ఏకైక క్యాన్సర్ చికిత్స కేంద్రం.. ఎంఎన్‌జే క్యాన్సర్ దవాఖానను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. 250 పడకల సామర్థ్యం గల నిజాం కాలం నాటి ఈ దవాఖాన సామర్థ్యాన్ని దశలవారీగా 750 పడకలకు పెంచింది. అంతేకాకుండా రోగులకు క్యాన్సర్ పరీక్షల నిర్ధారణ, చికిత్స కోసం అత్యాధునిక వైద్య పరికరాలు, యంత్రాలను సమకూర్చింది. సుమారు రూ.200కోట్ల వ్యయంతో ఎంఆర్ఐ, ట్రూభీమ్, పెట్-సీటీ స్కాన్, 128మల్టీైస్లెడ్స్ సీటీ స్కాన్ వంటి పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ బాధితుల కోసం ‘ఫ్లో సైటో మీటర్’ను ఏర్పాటు చేసింది.
దవాఖానను విస్తరించే క్రమంలో మల్లేపల్లి ఐటీఐ క్యాంపస్‌లో 2.25ఎకరాల స్థలంలో అరబిందో ఫార్మ సంస్థ సహకారంతో నూతనంగా అంకాలజీ బ్లాక్‌ను నిర్మించింది. సుమారు రూ.120కోట్ల వ్యయంతో 8అంతస్తుల్లో నిర్మించిన భవనంలో కొత్తగా 6 విభాగాలను అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్‌దే. అందులో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం, క్యాన్సర్ వ్యాధులు, కారకాలు, మూలకణాలపై ప్రత్యేక పరిశోధనా కేంద్రం, మాలిక్యులర్ అంకాలజీ విభాగం, జెనెటిక్ ల్యాబ్, హై ఎండ్ రేడియోథెరపీతో పాటు మహిళా క్యాన్సర్ రోగులకు ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇదికాకుండా అత్యంత క్లిష్టమైన క్యాన్సర్ సర్జరీలను జరుపడానికి అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో కూడిన రూ.32కోట్ల వ్యయంతో రోబొటిక్ యంత్రాన్ని సైతం అందుబాటులోకి తీసుకువచ్చింది. సదుపాయాలు మెరుగుపడటంతో ప్రతినెలా దాదాపు 250 క్లిష్టమైన క్యాన్సర్ సర్జరీలు చేస్తూ, కార్పొరేట్ స్థాయిలో చికిత్స అందించే స్థాయికి ఎంఎన్‌జే ఎదిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం దవాఖానను పట్టించుకోకపోవడంతో నిర్వహణ పూర్తిగా గాడితప్పింది.
రేడియాలజీ విభాగంలో ఇప్పటికే కాంట్రాస్ట్ ఇంజెక్షన్లు లేక కాంట్రాస్ట్ సీటీ-స్కాన్లు నిలిచిపోయి రోగులు ఇబ్బందులు పడుతుండగా.. మూలిగే నక్కమీద తాటికాయ పడినట్లు సాధారణ సీటీ స్కాన్ ఫిల్మ్‌ల కొరత కూడా వేధిస్తున్నది. సీటీ స్కాన్ పరీక్ష చేసిన తర్వాత నివేదికతోపాటు స్కానింగ్ చేసిన ఛాయా చిత్రాలను ఫిల్మ్ రూపంలో అందిస్తారు. వాటి ఆధారంగానే వైద్యులు చికిత్స చేస్తారు. కానీ దవాఖానలో సిటీ ఫిల్మ్‌ల కొరత ఉండడంతో సీడీలు తెచ్చుకోవాలని సూచిస్తున్నట్టు రోగులు ఆరోపిస్తున్నారు. సీడీలు తెచ్చుకున్నా.. వాటిని చూడటానికి వైద్యులకు కంప్యూటర్లు లేకపోవడం విచిత్రం. దీంతో తీసిన సీటీ స్కాన్‌ను ఎలా చూడాలో, వ్యాధులను ఎలా గుర్తించాలో అని వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.