నర్సింహులపేట, మార్చి 2: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో సాగు నీళ్ల కోసం రైతులు చందాలు వేసుకుని రూ. 50 వేలు సేకరించి కాల్వ పూడిక తీసినా చుక్కనీరు రావడం లేదు. నోటి కాడికొచ్చిన పంట ఎండిపోయేలా ఉందని అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మండలం నుంచి డీబీఎం 60 ప్రధాన కాల్వ ద్వారా వారానికోసారి ఎస్సారెస్పీ నీళ్లు వస్తున్నాయి. ఉప కాల్వల ద్వారా చెరువులు, కుంటలు, యాసంగి సాగు చేసిన వరి పొలాలకు నీరు రావడం లేదు.
దీంతో పెద్దనాగారం, వస్రంతండా, అజ్మీరాతండా, నర్సింహపురం బంజర, ముంగిముడుగు గ్రామాల శివారు పొలాలకు వెళ్లే 11ఎల్ ఉప కాల్వను 25 మంది రైతులు తలా రూ. 2వేలు వేసుకుని రూ.50 వేలతో పూడిక తీయించారు. అయినా నీళ్లు రావడంలేదు. ఉప కాల్వకు వచ్చే తూము దగ్గర గతంలో డ్రాప్‌లు (చెక్‌డ్యాం)లను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడంతో నీళ్లు రావడం లేదన్నారు. ఉప కాల్వకు నీరు వచ్చేలా ప్రధాన కాల్వలో సిమెంట్ దిమ్మెను తొలగించిన ప్రాంతంలో రాళ్లు అడ్డు పెడుతున్న క్రమంలో ఐబీ ఏఈ అభ్యంతరం తెలుపడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కాల్వ నీళ్లు ఖమ్మం జిల్లా వరకు వెళ్లాలని, ఇక్కడ రాళ్లు అడ్డుగా వేస్తే ఎలాగని బెదిరిస్తున్నారని వాపోయారు.