హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో మైకులు మూగబోయాయి. తొలి విడతలో 4,235 పంచాయతీల్లో ఎన్నికలు జరుగనుండగా, 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు అన్ని సర్పంచ్ స్థానాల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. వార్డులకు మాత్రం అత్యధిక చోట్ల ముఖాముఖీ పోటీ మాత్రమే ఉన్నది. ఈ నెల 3న సాయంత్రం (బుధవారం) మొదలైన తొలి విడత అభ్యర్థుల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తొలి విడత ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనేందుకు 70 వేల మంది సిబ్బందిని నియమించారు. వారికి ఇప్పటికే శిక్షణ కూడా ఇచ్చారు.
వారంతా బుధవారం ఉదయం 10 గంటలకు ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ఎన్నికల సామాగ్రితో సహా అదేరోజు సాయంత్రానికే పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రంలో ఓటర్లు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొనేలా ముందురోజు రాత్రికే అన్నింటినీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాలెట్ పత్రాలను ముద్రించి సిద్ధంగా ఉంచారు. వాటితోపాటు ఇతర వస్తువులను కూడా సమీకరించుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి తప్పులు దొర్లకుంట్ల ఎన్నికల నిబంధనలు పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని ఇప్పటికే రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీచేశారు. మంగళవారం ప్రిసైడింగ్ అధికారులకు, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. సీటింగ్ ఏర్పాట్లు, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటివి నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటచేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒక దానిని చూపితే ఓటింగ్‌కు అనుమతించాలని చెప్పారు.
మద్యం దుకాణాలు బంద్
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వివరిస్తూ, పోటీచేస్తున్న అభ్యర్థులతో ఇప్పటికే ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం ఓట్ల లెకింపు పూర్తయి, ఫలితాలు వెల్లడించే వరకు ఆయా మండలాల్లో మద్యం విక్రయాలపై నిషేధం విధించారు.
ఓటర్లకు తాయిలాల ఎర
తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు తాయిలాలకు తెరలేపారు. చివరిరోజు పూర్తిగా ఓటర్లకు డబ్బుల పంపిణీకి సిద్ధమయ్యారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ఇంటింటికీ మందు, చికెన్ పంపిణీ చేశారు. పలుచోట్ల వార్డు అభ్యర్థులు ఒక రోజు, సర్పంచ్ అభ్యర్థులు మరో రోజు తాయిలాలను పంచారు.