హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. వారికి ఎన్నికల గుర్తులు కూడా కేటాయించారు. పోటీచేస్తున్న సర్పంచ్, వార్డుల అభ్యర్థుల జాబితా, వారికి కేటాయించిన ఎన్నికల గుర్తుల వివరాలను బుధవారం సాయంత్రం అన్ని రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో పెట్టారు. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు ఎన్నికల గుర్తులు ఖరారు కావడంతో ప్రచారం ప్రారంభించారు. తొలి విడతలో ఎన్నికలు జరిగే 4,231 సర్పంచ్ స్థానాలకు 22,041 మంది పోటీలో ఉన్నారు. వీరిలో కొందరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అంటే సగటున ఒక్క సీటు కోసం ఐదుగురు బరిలో నిలిచారు. 37,307 వార్డులకు 85,328 మంది పోటీలో నిలిచారు. ఇక్కడ ముఖాముఖి పోటీ ఉండే అవకాశం ఉన్నది. కొన్ని చోట్ల త్రిముఖ పోటీ ఉండొచ్చు. ఈనెల 11వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. బుధవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు సుమారుగా వారంపాటు ప్రచారానికి అవకాశం ఉన్నది.
అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తులు జారీచేసింది. సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 గుర్తులు కేటాయించింది. సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు: ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్‌బాల్, లేడీపర్సు, టీవీ రిమోట్, టూత్‌పేస్ట్, స్పానర్, చెత్తడబ్బా, నల్లబోర్డు, బెండకాయ, కొబ్బరితో ట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మాన్, మనిషి తెరచాప ప డవ, బిస్కట్, వేణువు (పిలనగ్రోవి), చెయిన్ (గొలుసు), చెప్పులు, బెలూన్, వికెట్లు ఉన్నాయి. వార్డు సభ్యుల గుర్తులు ఇలా.. గౌను, గ్యాస్‌స్టవ్, స్టూల్, గ్యాస్ సిలిండర్, బీరువా, విజిల్, కుండ, డిష్ యాంటినా, గరాటా(గౌర), ముకుడు, ఐస్‌క్రీమ్, గాజుగ్లాసు, పోస్టు డబ్బా, ఎన్వలప్ కవర్, హాకీ బ్యాట్ బంతి, నెక్ టై, కటింగ్ ప్లేయర్, పెట్టె, విద్యుత్తు స్తంభం, కెటిల్ ఉన్నాయి.
రెండో విడత పంచాయతీ ఎన్నికలకు బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసింది. సాయంత్రం ఐదు గంటల తర్వాత గ్రామాల్లో చెల్లుబాటైన నామినేషన్ వేసిన అభ్యర్థుల జాబితాను రిటర్నింగ్ అధికారులు(ఆర్వో) ప్రకటించారు. రెండో విడతకు తొలి రోజు నామినేషన్లు స్వల్పంగా వచ్చాయి. రెండోరోజు కాస్త మెరుగ్గా, మూడో రోజు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటెత్తా రు. 4,332 సర్పంచ్‌లకు 28,278 నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే సగటున ఒక్కో సర్పంచ్ స్థానానికి 6.52% మంది బరిలో నిలిచారు. అలాగే 38,342 వార్డులకు 93,595 మంది బరిలో నిలిచారు. అంటే ఒక్కో వార్డుకు 2.44% మంది పోటీ పడుతున్నారు.
మూడో విడత ఎన్నికలకు సంబంధించిన నోటీసులను బుధవారం రిటర్నింగ్ అధికారు లు జారీచేశారు. 31 జిల్లాల్లోని 72 రెవెన్యూ డివిజన్లు, 182 మండలాల్లోని 4,159 గ్రామ సర్పంచ్ స్థానాలకు, 36,452 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఆర్వోలు ప్రకటించారు. అనంతరం వార్డులవారీగా ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీల ఎదుట ప్రదర్శించారు. ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించారు. తొలి రోజు నామినేషన్ల దాఖలు ప్రక్రియ మందకొడిగా సాగింది. మరోరెండు రోజులపాటు నామినేషన్లకు అవకాశం ఉండటంతో తొలి రోజు నామినేషన్లు తక్కువగా నమోదయ్యాయి. చివరి రోజే అత్యధిక అభ్యర్థులు నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది. కాగా, నామినేషన్ల వివరాలను ఎస్ఈసీ అధికారులు అర్ధరాత్రి వరకు కూడా వెల్లడించలేదు.
