Kodangal | హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల ఘటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదంటూ రైతులు ఆందోళనలు ఉధృతం చేశారు. బలవంతంగా భూసేకరణకు ప్రయత్నిస్తున్న అధికారులపై గిరిజన రైతులు దాడి చేయడం నుంచి మొదలుకొని పోలీసుల అరెస్టుల వరకు ఆ ప్రాంతం అట్టుడుకుతున్నది. పోలీసులు అర్ధరాత్రి ఆందోళనకారుల ఇండ్లలోకి విరుచుకుపడి అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లలో చిత్రహింసలకు గురిచేయడంతో పరిస్థితి మరింత తీవ్రరూపు దాల్చింది. మా భూములు లాక్కోవద్దు మొర్రో అని మొరపెట్టుకున్న రైతులు జైలు పాలయ్యారు. బాధితుల కుటుంబ సభ్యులేమో తమవారిని కాపాడుకునేందుకు అధికారులు, రాజకీయ నేతల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. గిరిజన బిడ్డల ఆవేదనపై సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతున్నది. ప్రతిపక్షాలు, ప్రజా, మహిళా, గిరిజన సంఘాలు స్పందిస్తున్నాయి. సర్కారు తీరు సరికాదని తప్పుబడుతున్నాయి. నియోజకవర్గంలో నిర్బంధపు నీడన నోరెత్తలేని దుస్థితిలో హైదరాబాద్ వచ్చిన బాధితులు తమ ఆర్తనాదాలను వినిపించారు. లగచర్ల బాధితుల గోడు మీడియాలో చర్చనీయాంశమైంది& పత్రికల్లో పతాకశీర్షికన చేరింది. పోలీసులు వ్యవహరించిన అమానవీయ వైఖరి, మహిళలను కూడా తీవ్రంగా గాయపర్చిన తీరు బాహ్యప్రపంచానికి తెలిసింది. అసలు కొడంగల్లో ఏం జరుగుతున్నది? అంటూ అక్కడి అరాచకాలపై జనం ఆలోచిస్తున్నారు.
కొడంగల్లో అరాచకాలు ఇంత దారుణంగా జరుగుతుంటే ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం అంతా జరుగుతున్నది సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలోనే అయినా ఆయన నుంచి స్పందన కరవైంది. కొడంగల్ నిప్పుల కుంపటిలా మండుతున్నా రేవంత్ మాత్రం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిందిపోయి.. ఢిల్లీ, మహారాష్ట్రలో పర్యటించడంపై ప్రజానీకం మండిపడుతున్నారు. రేవంత్ శనివారం ఉదయం మహారాష్ట్రకు వెళ్లారు. రెండు రోజులపాటు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ పర్యటనపై కొడంగల్వాసులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వారంలో రెండుసార్లు మహారాష్ట్రకు వెళ్లేందుకు సమయం ఉందిగానీ, బాధితుల గోడు వినేందుకు సమయం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలనే పట్టించుకోలేని వ్యక్తి, మహారాష్ట్రలో ఏ మొహం పెట్టుకుని ప్రచారం చేస్తారని నిలదీస్తున్నారు. సొంతరాష్ట్రం, సొంత నియోజకవర్గంలోని ప్రజలకు సమాధానం చెప్పకుండా, అనుమానాలను నివృత్తి చేయకుండా మహారాష్ట్ర ప్రజలకు ఏం భరోసా ఇస్తారని అడుగుతున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే పేదల భూములు గుంజుకుంటామని చెప్తారా? అని ప్రశ్నిస్తున్నారు. లగచర్లలో ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ భూములు ఎందుకు తీసుకుంటున్నారు? పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి, ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందిపోయి మంత్రులు, అధికారులు, కాంగ్రెస్ నేతలు బాధితులపైనే ఎదురుదాడికి దిగుతున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.