హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నది దుష్ప్రచారం అని మరోసారి తేలింది. కాగ్ నివేదిక ప్రకారం గత నాలుగు నెలల్లో ప్రభుత్వం సగటున నెలకు రూ.2,338 కోట్లు మాత్రమే వడ్డీ చెల్లించింది. ఈ విషయం స్వయంగా కాంగ్రెస్ సర్కారే వెల్లడించింది. ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలలకు సంబంధించి కాగ్‌కు సమర్పించిన గణాంకాల్లో ఈ విషయం స్పష్టమైంది.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటిపోయినా ఆర్థిక అనిశ్చితి మాత్రం కొనసాగుతూనే ఉన్నది. రాష్ట్ర ఆదాయం క్రమంగా తగ్గిపోతుండగా, ప్రభుత్వం రికార్డు స్థాయిలో అప్పులు చేస్తూ ప్రజల నెత్తిన భారం పెంచుతున్నది. ప్రభుత్వం తాజాగా కాగ్‌కు సమర్పించిన జూలై నివేదికే ఇందుకు సాక్ష్యం. ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ రాబడులు రూ.50,270 కోట్లు సమకూరాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో రెవెన్యూ రాబడులు రూ.2.29 లక్షల కోట్లుగా అంచనా వేసింది.
మూడింట ఒకవంతు ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాబడులు 21 శాతానికే పరిమితం అయ్యింది. ఇదే సమయంలో రాష్ట్ర అప్పులు మాత్రం పెరిగిపోతున్నాయి. బడ్జెట్లో ఈ ఏడాది కాలంలో రూ.54,009 కోట్లు రుణాలు సేకరిస్తామని చెప్పగా, నాలుగు నెలల్లోనే 45 శాతం రుణాలు సమీకరించింది. గత ఐదేండ్లలో జూలైనాటికి సమీకరించిన అత్యధిక మారెట్ రుణం ఇదే కావడం ఆందోళన కలిగిస్తున్నది. ఆదాయం తగ్గిపోవడంతో దీని ప్రభావం మూలధన వ్యయంపై పడిం ది. ఈ ఏడాది బడ్జెట్లో పెట్టుబడి వ్యయం రూ.36,504.45 కోట్లుగా ప్రతిపాదించారు. జూలై వరకు రూ.5,988.27 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే అంచనాలో ఇది 16.40 శాతం మాత్రమే.
సొంత ఆదాయ రాబడులుగా భావించే ట్యాక్స్ రెవెన్యూ (జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ రెవెన్యూ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ సుంకాలు) ఈ నాలుగు నెలల్లో పెరుగకపోగా, తగ్గుదల నమోదైంది. ఆర్థిక సంవత్సరంలో 33 శాతం సమయం గడిచిపోగా.. ట్యాక్స్ రెవెన్యూ సగటున 23 శాతమే నమోదైంది. కీలకమైన స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, సేల్స్ ట్యాక్స్ వంటివి తగ్గడం ఆందోలన కలిగిస్తున్నది. రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2,738 కోట్ల ఆదాయ మిగులుగా బడ్జెట్లో అంచనా వేసింది. కానీ జూలై వరకు రూ.12,564 కోట్ల ఆదాయ రెవెన్యూ లోటు నమోదైంది. ఆర్థిక లోటు రూ.24,669 కోట్లుగా ఉన్నది. సొంత రాబడులతోపాటు పన్నేతర ఆదాయాలు, కేంద్ర గ్రాంట్లు గణనీయంగా మెరుగుపడకపోతే, పెరుగుతున్న ఖర్చులు, సంక్షేమ పథకాల అమలు కష్టతరమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర అప్పులు, మిత్తీలపై ప్రభుత్వ పెద్దలు చెప్తున్నది తప్పుడు లెక్కలని కాగ్ నివేదిక నిరూపించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ.6,500 కోట్ల వడ్డీ కడుతున్నామని సీఎం, డిప్యూటీసీఎం, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ కాగ్ గణాంకాలను విశ్లేషిస్తే కనీసం ఆ దరిదాపుల్లో కూడా లేదని స్పష్టం అవుతుంది. కాగ్ నివేదిక ప్రకారం గత నాలుగు నెలల్లో ప్రభుత్వం చెల్లించిన వడ్డీ రూ.9,355 కోట్లు మాత్రమే. నెలకు రూ.2,338 కోట్లు చెల్లిస్తున్నది. అంటే ప్రభుత్వం చెప్తున్నదాంట్లో సగం కూడా కట్టడం లేదన్నమాట.
-పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత