హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను అందుకోలేకపోయింది. ఆదాయం అంచనాల కంటే తకువగా నమోదైంది. రెవెన్యూ మిగులుకు బదులుగా భారీస్థాయిలో లోటు ఏర్పడింది. రోజువారీ ఖర్చుల కోసం కూడా అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. గత ఏడాదికి రూ.54,009.74 కోట్ల అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఏకంగా రూ.77,762.35 కోట్లు అప్పు తెచ్చింది. అంటే 143.98 శాతం అదనంగా అప్పులు చేసింది. బడ్జెట్లో రూ.2.84 లక్షల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయగా, రూ.2.6 లక్షల కోట్లు మాత్రమే సమకూరింది. ఇందులో సింహభాగం అంటే రూ.77,762 కోట్లు.. అప్పులు, ఇతర రుణ బాధ్యతల ద్వారానే రావడం గమనార్హం. బడ్జెట్లో రూ.2,738 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని ఆశించగా, చివరకు రూ.9,235 కోట్ల రెవెన్యూ లోటుతో ఏడాది ముగిసింది. ద్రవ్యలోటు 77,762 కోట్లకు చేరగా, దీనిని అప్పుల ద్వారా ప్రభుత్వం సర్దుబాటు చేసింది. ఇక ప్రాథమిక లోటు అంచనా వేసిన రూ.34,640 కోట్ల కంటే 138.80 శాతం పెరిగి రూ.48,082 కోట్లుగా నమోదైంది. ఈ విషయాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ బుధవారం విడుదల చేసిన నివేదిక స్పష్టంచేసింది. కాగ్ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణారాహిత్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. బడ్జెట్ అంచనాలు వేరు, వాస్తవ గణాంకాలు వేరు అన్నట్టుగా ఆర్థిక పరిస్థితి తయారైంది. ఆదాయం రాక, అప్పులు ఆగక రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆ నివేదిక స్పష్టం చేస్తున్నది.
రాష్ట్ర రెవెన్యూ రాబడులు రూ.1.81 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. ఇది బడ్జెట్ అంచనా అయిన రూ.2.29 లక్షల కోట్ల కంటే రూ. 38,000 కోట్లు తకువ. మరోవైపు, అప్పులు, ఇతర రుణాల రూపంలో వచ్చే మూలధన రాబడులు అంచనా వేసిన రూ.55,116 కోట్ల కంటే గణనీయంగా పెరిగి రూ.78,197 కోట్లకు చేరుకున్నాయి. ఇందులో కేవలం అప్పులే రూ.77,762 కోట్లు కావడం గమనార్హం. పన్నుల ఆదాయంలోనూ రాష్ట్రం వెనుకబడింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.21,080 కోట్లు (అంచనాల్లో 99.46%) అందినప్పటికీ, మిగిలిన మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం నిరాశపరిచింది. జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, అమ్మకపు పన్ను వంటి కీలక వనరుల ద్వారా వచ్చిన రాబడి ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 90 శాతం కంటే తకువగానే నమోదైంది. రాష్ట్ర పన్నుల ఆదాయం రూ.1.52 లక్షల కోట్లుగా నమోదైంది. ఇందులో జీఎస్టీ ద్వారా రూ.52,375 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.15,251 కోట్లు, ఎక్సైజ్‌శాఖ ద్వారా రూ. 23,359 కోట్లు సమకూరాయి.
కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలోనూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్-ఇన్-ఎయిడ్, ఇతర సహకారం బడ్జెట్లో అంచనా వేసిన రూ.22,782 కోట్లలో, కేవలం రూ.10,422 కోట్లు (45.75%) మాత్రమే వచ్చాయి. రాష్ట్రానికి రావాల్సిన వాటాను సాధించుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. తొలి 11 నెలలు మందకొడిగా సాగిన పన్నేతర ఆదాయం మార్చి నెలలో పుంజుకున్నది. కేవలం మార్చిలోనే రూ.9,881 కోట్లు వసూలు కావడంతో, మొత్తం పన్నేతర ఆదాయం రూ.18,986 కోట్లకు చేరింది. అంచనా వేసిన ఆదాయం (రూ.2.84 లక్షల కోట్లు) రాకపోవడం, అనుకున్న దానికంటే తకువగా ఖర్చు (92.95%) చేసినా లోటు పెరగడం గమనార్హం. అప్పుల ద్వారానే ద్రవ్యలోటును సర్దుబాటు చేయ డం తెలంగాణ భవిష్యత్తు ఆర్థిక స్థితికి గొడ్డలిపెట్టులా మారుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేసీఆర్ హయాంలో ఆర్థికంగా బలంగా ఉన్న తెలంగాణ, ఇప్పుడు క్రమంగా ఆర్థిక అస్థిరత వైపు పయనిస్తున్నదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వ్యయాల విషయానికి వస్తే, మార్చి చివరి నాటికి వడ్డీ చెల్లింపులు రూ.29,679 కోట్లకు చేరాయి. పెన్షన్ల ఖర్చు కూడా అంచనా వేసిన రూ.13,109 కోట్ల కంటే 147 శాతం పెరిగి రూ.19,371 కోట్లుగా నమోదైంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల కోసం రూ.47,400 కోట్లు ఖర్చు చేశారు, ఇది అంచనా కంటే 6 శాతం ఎకువ. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఐదు విడతల కరువు భత్యం బకాయిలను చెల్లించాల్సి ఉన్నది. మూలధన వ్యయం రూ.52,905 కోట్లకు పెరిగినప్పటికీ, తగినంత ఆదాయం పెరగకుండా చేసే అప్పులు దీర్ఘకాలంలో భారం అవుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ హామీలు, పబ్లిక్ అకౌంట్ అప్పులకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించలేదని నివేదికలో పేర్కొన్నారు. బడ్జెట్ వెలుపల చేసిన అప్పుల వివరాలను ప్రభుత్వం దాచిపెట్టే అవకాశం ఉన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్లో ఆదాయాన్ని ఎకువగా అంచనా వేయడం, ఖర్చులను తకువగా చూపడం వల్ల తెలంగాణ ఆర్థిక స్థితి ప్రస్తుతం అప్పుల ఊబిలోకి వెళ్తున్నదని హెచ్చరిస్తున్నారు.
