నర్సంపేట, ఆగస్టు10 : నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల సమక్షంలో ఎట్టకేలకు కూల్చిన చోటే గద్దె కట్టి ఆ యన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహం వద్దకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. దీంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పకుండా వరంగల్ ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, నర్సంపేట ఏసీపీ పున్నం రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.
నర్సంపేటలో విగ్రహ గద్దె కూల్చివేత ప్రదేశాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం అంబేదర్ సెంటర్లో పార్టీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలతో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ప్రభు త్వానికి, అధికారులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు ఎర్రబెల్లిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో నాయకులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
నర్సంపేట : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఏర్పాటు గద్దె కూల్చడం దౌర్జన్యం. ఇది దుర్మార్గమైన, అనైతికమైన చర్య. విగ్రహావిష్కరణను అడ్డుకోవడం వెనుక కాంగ్రెస్ నాయకుల కుట్ర దాగి ఉంది. కాంగ్రెస్ ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఖచ్చితంగా పెద్ది విగ్రహాన్ని ఆవిషరించి తీరుతాం. ప్రజల మనోభావాలను ప్రతి ఒక్కరు గౌరవించాలి.
– ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ మంత్రి
నర్సంపేట : మున్సిపల్ అధికారులు ఎలాంటి నోటీసులివ్వకుండానే పెద్ది విగ్రహ ఏర్పాటు గద్దెను కూల్చివేయడం దారుణం. నర్సంపేటలో ఎన్ని విగ్రహాలు అనుమతితో పెట్టారో అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలి. గద్దెను కూల్చిన వారిని కఠినంగా శిక్షించాలి. లేకపోతే రాష్ట్ర, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడ్తాం. ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహ గద్దె కూల్చివేయడం కుట్రలో భాగమే. అదే స్థలంలో పెద్ది విగ్రహాన్ని ఏర్పాటు చేయకుంటే చట్ట, న్యాయపరంగా ముందుకు వెళ్తాం.
– బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎంపీ