హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తేతెలంగాణ): హైకోర్టు తీర్పు కారణంగా వాయిదా పడిన స్థానిక ఎన్నికలపై తాజాగా జరిగిన క్యాబినెట్ భేటీలోనూ క్లారిటీ రాలేదు. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశ వివరాలను రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దాఖలైన పిటిషన్ నవంబర్ 3న హైకోర్టులో విచారణకు రానుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తామని వెల్లడించారు. అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 21(3)ని తొలగించేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వివరించారు. అసెంబ్లీని ప్రోరోగ్ చేసినందున ఆర్డినెన్స్ ప్రతిపాదన ఫైల్‌ను గవర్నర్‌కు పంపించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్‌స్పెషాలిటీ దవాఖాన, ఎల్బీ నగర్, సనత్‌నగర్, అల్వాల్ టిమ్స్ నిర్మాణ పనుల్లో వేగంపెంచాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని తెలిపారు.
రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలు ఆమోదించినట్టు పేర్కొన్నారు. రామగుండంలో 52 ఏండ్ల క్రితం నాటి థర్మల్ స్టేషన్(ఆర్టీఎస్-బీ 62.5 మెగావాట్ల యూనిట్) కాలపరిమితి ముగియడంతో దానిని తొలగించాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భవిష్యత్తు విద్యుత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని విద్యుత్తు శాఖ అధికారులను క్యాబినెట్ ఆదేశించినట్టు చెప్పారు.
ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పునరుద్ధరించాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. 44 కిలోమీటర్ల పనుల్లో ఇప్పటివరకు 35 కిలోమీటర్ల తవ్వకం పనులు పూర్తయినందున మిగిలిన సొరంగం పనులను అధునాతన డ్రిల్లింగ్ విధానంలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. పూర్వపు కాంట్రాక్ట్ ఏజెన్సీకే సొరంగం తవ్వకం పనులు బాధ్యతలు అప్పగించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తిచేసి గ్రావిటీ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఉమ్మడి నల్లగొండకు నీరందించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని మంత్రి వివరించారు.