హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 17న నిర్వహించే క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి నవీన్ యాదవ్‌ను సన్మానించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ‘రెండేళ్ల మా పాలనను గమనించే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు’ అని చెప్పారు. గెలుపును బాధ్యతగా భావించి హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. జూబ్లీహిల్స్ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని చెప్పారు. ఈ స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధికి రోడ్ మ్యాప్ తయారు చేస్తామని తెలిపారు. మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ పునరుజ్జీవం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, గోదావరి జలాల తరలింపునకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇందుకు బీఆర్ఎస్, బీజేపీ సహకరించాలని కోరారు.
మూయించేందుకు నిమిషం పట్టదు
‘టీవీలు, పేపర్లను మూయించేందుకు నిమిషం పట్టదు. పక్కరాష్ట్రంలో కొన్ని టీవీలు లేనేలేవు’ అంటూ మీడియాపై సీఎం రేవంత్ రుసరుసలాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఫలితాల సమయంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రసారం చేయకపోవడంపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరే ఎన్నికలు పెట్టి.. మీరే అభ్యర్థిని పెట్టి.. మీరే అసెంబ్లీకి పంపిస్తారా?’ అంటూ మీడియాపై కోపాన్ని ప్రదర్శించారు. ‘కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రసారం చేయకుంటే ఆ టీవీలను, పేపర్లను మూసివేస్తా’మనే విధంగా బెదిరింపు ధోరణితో మాట్లాడారు.
గాంధీభవన్‌లో రప్పా రప్పా…
రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని, విద్వేషాల సంస్కృతిని తీసుకొస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్ సంబురాలను గాంధీభవన్‌లో నిర్వహించగా అక్కడ కొన్ని పోస్టర్లు కనిపించాయి. సినిమా డైలాగులతో రెచ్చగొట్టేలా ‘రప్పా రప్పా’, ‘తగ్గేదేలే’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోతో ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు. ‘2028 ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గేదేలే’ అంటూ పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదెక్కడి సంస్కృతి అంటూ రాజకీయ వేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, అంతేతప్ప ఇలా రెచ్చగొట్టే పోస్టర్ల ప్రదర్శన ఎంతమాత్రం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.