హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈనెల 6న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన దాదాపు 8 అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది. ఇందులో కులగణన, ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత, టీటీడీ తరహాలో యాదాద్రికి పాలకమండలి ఏర్పాటు వంటి అంశాలు ఉన్నట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి. ఎల్ఆర్ఎస్పై చర్చించి మరో కొత్త నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా చర్చించనున్నట్టు తెలిసింది. గతేడాది వరకు ఫిబ్రవరిలోనే బడ్జెట్ సమావేశాలు జరిగేవి. అయితే ఈసారి ప్రభుత్వం మార్చి వరకు పొడిగించింది. ఈ నెలలో కచ్చితంగా బడ్జెట్ను ఆమోదించాల్సి ఉండడంతో సమావేశాల నిర్వహణ తేదీలను ప్రాథమికంగా నిర్ణయించే అవకాశం ఉన్నదని సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మంత్రిమండలి ప్రత్యేకంగా చర్చించనున్నది. ఆర్థికంగా భారం పడే అంశాలేవీ క్యాబినెట్లో చర్చించకూడదని ప్రభుత్వం ఆదేశించినట్టు సచివాలయ వర్గాలు తెలిపాయి.