Cabinet Expansion | ఢిల్లీ, జూన్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఊహాగానాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెరదించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని, పార్టీ అధిష్ఠానానికి ఆ ఆలోచన లేదని చెప్పారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
మంత్రివర్గంలో స్థానం కోసం ఎవ్వరైనా పార్టీ అధిష్ఠానాన్ని కలువవచ్చని, కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలున్నారని, అందరికీ మంత్రులయ్యే అర్హత ఉన్నదని అన్నారు. నిబంధనల మేరకు తెలంగాణలో మంత్రుల సంఖ్య 17కు మించరాదని, అందువల్ల అందరికీ మంత్రిపదవులు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై మీడియా ప్రశ్నించడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.
మీనాక్షీ నటరాజన్ కేసుకు సంబంధించిన వివరాలను కాంగ్రెస్ వాళ్లే బీజేపీకి లీకు చేశారు అన్న ఆరోపణపై సీఎం నేరుగా స్పందించలేదు. ఈ ప్రశ్నలు అడుగుతున్న జర్నలిస్టులకు బీజేపీ, బీఆర్ఎస్ పూనిందని వ్యాఖ్యానించారు. ‘కిషన్‌రెడ్డి, కేటీఆర్‌లు ఏమన్నా జర్నలిస్టులను ఆవహించారా..? ఇక్కడ ఉన్న జర్నలిస్టుల్లో చాలామంది పార్టీల కార్యకర్తల్లా ఉన్నారు’ అంటూ తన అక్కసు వెళ్లగక్కారు. ప్రతి పార్టీకో పేపర్, చానల్ ఉన్నదని, అలాంటి వాటిల్లో పనిచేసేవారిని తాను జర్నలిస్టులుగా గుర్తించబోనని చెప్పుకొచ్చారు. మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరణ విషయంలో రిటర్నింగ్ అధికారి బీజేపీ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తాను వెళ్లి కౌగలించుకోలేదని, ఆయనే వచ్చి తనను కౌగిలించుకున్నాడని చెప్పారు. రాష్ర్టానికి ప్రధాని నిధులు ఇవ్వకపోతే ప్రధానమంత్రినే మార్చి నిధులు తెచ్చుకుంటాం అని చెప్పారు. హిట్లర్‌పై తాను బెంగళూరులో చేసిన వ్యాఖ్యల నుంచి రేవంత్‌రెడ్డి యూటర్న్ తీసుకున్నారు.
దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగడంతో ఆయన దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. అందులోభాగంగానే ఆయన తాను హిట్లర్ గురించి మాట్లాడినదాన్ని పత్రికలు, చానళ్లు వక్రీకరించాయని, హిట్లర్‌ను తనకు రోల్‌మోడల్‌గా చెప్పలేదని అన్నారు. ఇటీవల ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాష్ర్టానికి ఎవరైనా రావచ్చని, సభలు పెట్టుకోవచ్చని చెప్పారు. అయితే, లా అండ్ ఆర్డర్ సమస్య ఉన్నందునే పవన్ సభకు అనుమతులు ఇవ్వలేదని వివరించారు. రాష్ర్టానికి నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని, రాష్ర్టానికి నిధులు ఇవ్వవద్దని ఆయన కేంద్రంలోని ఇతర మంత్రులకు కూడా చెప్తున్నాడని రేవంత్ ఆరోపించారు.