హైదరాబాద్ : రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ(Cabinet expansion) ఆరడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. ప్రజా పాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress) సంవత్సరం పూర్తయినా మంత్రి వర్గ విస్తరణ చేపట్టడం లేదు. కీలకమైన శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉండటంతో పాలన పడకేసింది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో గురుకులాల పరిస్థితి దారుణంగా మారింది. సరైన పర్యవేక్షణ, పాలన వైఫల్యంతో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు.
కాగా, గత కొన్ని నెలలుగా విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి.
అయితే విస్తరణ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. డిసెంబరు ఆఖరులోగా జరిగే అవకాశం ఉందంటూ మంత్రులు సైతం ప్రకటనలు చేయడం.. అధిష్ఠానంతో చర్చలు.. విస్తరణ ఉంటుందని అంతా భావించినా, తాజా పరిణామాలను బట్టి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటం, ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లటం, ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో జనవరిలో మంత్రివర్గ విస్తరణకు అవకాశాలు తక్కువేనని కాంగ్రెస్ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారు. దీంతో పార్టీ కోసం పని చేసిన ఆశావహులు తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు. ప్రతి పనికి ఢిల్లీ అధిష్టానంపై ఆధారపడటంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన పడకేయడంతో ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తుంటే సమాధానం చెప్పలేకపోతున్నామని కాంగ్రెస్ నాయకులు వాపోతున్నారు.