హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం మరోసారి ఉద్యోగులను ఉసూరుమనిపించింది. ‘తాము మీటింగ్ పెట్టడమే తీపి కబురు’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్టుగానే ప్రభుత్వం వ్యవహరించింది. ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు అందుకు అద్దం పడుతున్నాయి. ఉద్యోగులకు 2023 జనవరి 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన 5 పెండింగ్ డీఏల్లో ప్రస్తుతం ఒక డీఏను మాత్రమే ప్రభుత్వం చెల్లించనుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు బకాయి పడిన ఎరియర్స్‌ను 28 వాయిదాల్లో చెల్లించనున్నారు. మరో డీఏను వచ్చే ఏప్రిల్‌లో ప్రకటించాలని నిర్ణయించారు.
ఇంకో డీఏను ఆరు నెలల తరువాత చెల్లించనున్నారు. అంటే ప్రస్తుతం 4 డీఏలు అలాగే పెండింగ్‌లో ఉంటాయన్నమాట. ఈ మేరకు క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో మంత్రిమండలి సచివాలయంలో గురువారం ప్రత్యేకంగా భేటీ అయింది. ఉద్యోగుల సమస్యలు, పంచాయతీరాజ్, మెట్రో విస్తరణ తదితర శాఖలకు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడారు. క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి భట్టి మాట్లాడుతూ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాలని నిర్ణయించామని, అందులో ఒక డీఏను వెంటనే అమలు చేయనుండగా, మరో డీఏను 6 నెలల తర్వాత అమలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఆరోగ్య సేవలకు సంబంధించి చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన, అధికారులు, ఉద్యోగులతో కలిపి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నామని, ప్రతినెలా ఉద్యోగులు రూ.500 చొప్పున జమ చేస్తే, అంతే మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుందని వివరించారు.
హెల్త్‌కేర్ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య సేవలను అందించనున్నామని వివరించారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ప్రతినెలా రూ.700 కోట్లకు తగ్గకుండా చెల్లించాలని, సెక్రటేరియట్లో 12.5 శాతం కోటా ఉండాలన్న ఉద్యోగ సంఘాల డిమాండ్‌ను క్యాబినెట్ ఆమోదించిందని తెలిపారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కమిటీ ఏర్పాటుకు, రిటైరైన ఉద్యోగుల సేవలు తిరిగి వినియోగించుకోవద్దని, గ్రామపంచాయతీలో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీ గ్రేడ్‌ను అనుసరించి గ్రేడింగ్ ఇవ్వాలని, రెగ్యులర్‌గా డీపీసీలు నిర్వహించి ఉద్యోగుల ప్రమోషన్లు ఇవ్వాలని,
ఎన్నికల సమయంలో బదిలీపై వెళ్లిన ఉద్యోగులను వెనకి పంపాలని, నర్సింగ్ డైరెక్టర్ ఏర్పాటుచేయాలని, అంగన్వాడీల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.రెండు లక్షలకు పెంచాలని, అధికారులు వినియోగించే అద్దె వాహనాల పెండింగ్ బిల్లుల క్లియర్ చేయడంతోపాటు వాహనాల అద్దెలను పెంచాలనే డిమాండ్లపై క్యాబినెట్ సానుకూలంగా స్పందించిందని వివరించారు. జీవో 317 ఎగ్జామిన్ చేస్తామని, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి క్యాబినెట్లో లోతుగా చర్చించామని, సానుకూలంగా స్పందించిన క్యాబినెట్ సహచరులందరికీ ఉద్యోగుల సబ్ కమిటీ చైర్మన్‌గా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రైతు భరోసా పెట్టుబడి సాయం రైతులకు మళ్లీ నిరాశ ఎదురైంది. క్యాబినెట్ సమావేశంలో రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని రైతులంతా ఎదురుచూశారు. కానీ ఈ సమావేశంలో రైతుభరోసాపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిసింది. దీంతో వానకాలం పెట్టుబడి సాయం పంపిణీపై సందిగ్ధత నెలకొన్నది.
నిరుడు యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసాను ప్రభుత్వం ఇప్పటికీ పూర్తి చేయలేదు. యాసంగి సీజన్‌కు రూ. 9,200 కోట్లు పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం మూడున్నర ఎకరాల వరకు సుమారు రూ. 5,000 కోట్లు మాత్రమే పంపిణీ చేసింది. ఇప్పుడు వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో ఈ సీజన్ కూడా రైతు భరోసా ఇవ్వాల్సి ఉంది. ఈ సీజన్ కోసం దాదాపు రూ. 9,200 కోట్లు అవసరం కానున్నాయి.
హైదరాబాద్, జూన్ 5( నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికలపై చర్చించేందుకు ఈ నెలలో మరోసారి భేటీ కావాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు తెలిసింది. గురువారం నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఎన్డీఎస్ఏ నివేదికపై చర్చను ఎజెండాలో చేర్చారు. దీంతో ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్ధం చేసుకొని ఆరుగంటలపాటు వేచిచూశారు.
చివరి నిమిషంలో కాళేశ్వరం అంశాన్ని ఎజెండా నుంచి తొలగించినట్టు సమాచారం. 11న కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారని, ప్రభుత్వ దుష్ప్రచారాన్ని కమిషన్ ఎదుటే తిప్పికొడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైనట్టు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ నివేదికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో కూడిన పూర్తిస్థాయి చర్చ అవసరమని నిర్ణయించినట్టు తెలిసింది.