హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసాలో షరతులు, కోతలకు శనివారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపనున్నది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానున్నది. ఇందులో ప్రధానంగా రైతు భరోసాపై చర్చించనున్నారు. రైతు భరోసాకు వివిధ ఆంక్షలు విధిస్తూ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫారసులను మంత్రిమండలి చర్చించి ఆమోదించనున్నది.
భూమి లేని కూలీలకు ఏటా రూ.12 వేలు ఆర్థిక సాయం అందించే అంశంపై కూడా చర్చించి ఆమోదించనున్నట్టు తెలుస్తున్నది. భూ భారతి బిల్లు ప్రకారం వీఆర్వో వ్యవస్థ ఏర్పాటుకు సైతం ఆమోదం తెలుపనున్నది. వీఆర్వోలు, సర్వేయర్ల నియామకంపై చర్చించనున్నది. బీసీ రిజర్వేషన్ల కోసం నియమించిన ప్రత్యేక కమిషన్ నివేదికపై చర్చ జరుగనున్నట్టు సమాచారం. రేషన్‌కార్డులు, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు తదితర అంశాలపై చ ర్చించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.