కాంగ్రెస్, బీజేపీ ఒకే గొడుగు కింద పనిచేసే పార్టీలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. వారి టార్గెట్ అంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ విడిచి వెళ్లిన వారి స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సూచించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సభను జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులకు నిరంజన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రజతోత్సవ సభను విజయవంతం చేయడానికి గ్రామగ్రామాన సమావేశాలు, సోషల్మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి కార్యకర్తలు, ప్రజలను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు. 25 ఏండ్ల బీఆర్ఎస్ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్ఫూర్తి కలిగించాలని కోరారు. తెలంగాణ ఆస్తి కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్14 ఏండ్ల ఉద్యమ చరిత్ర, 10 ఏండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారిందని అన్నారు. కానీ కొంతమంది కుట్రలు, కుతంత్రాల వల్ల అధికారం కోల్పోయినప్పటికీ ప్రజల్లో కేసీఆర్, బీఆర్ఎస్కు అభిమానం తగ్గలేదని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. అబద్ధపు హామీలు ఎరవేసి కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేయించుకుందని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమేనని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం కావడంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఆక్రోశంతో ఉన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదని భావించి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలను వాయిదా వేస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్కు ప్రజలు ఓటు వేసి బాధపడుతున్నారని అన్నారు. కేసీఆర్ విలువ, బీఆర్ఎస్ పార్టీ అవసరం ప్రజలకు తెలిసివచ్చిందని అన్నారు. తెలంగాణ సమాజం ఎప్పటికీ కాంగ్రెస్ను నమ్మదని చెప్పారు.