హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలు పార్టీ మారిన పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవని, అక్కడ కాంగ్రెస్ ఓటమి ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ నైజం మోసం అని, అబద్ధాల పునాదుల మీదనే రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, హామీల అమలులో పూర్తిగా విఫలమైందని, ప్రజలకు తీరని ద్రోహం చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలను మోసం చేయడమే తమ నైజమని రేవంత్‌రెడ్డి గతంలోనే చాలాసార్లు స్పష్టంగా చెప్పారని, అయినా ప్రజలు ఆయన అబద్ధపు హామీలను నమ్మి ఓటు వేసి మోసపోయారని చెప్పారు. కాంగ్రెస్ చెప్పినట్టుగానే మళ్లీ పాతకాలపు ఎమర్జెన్సీ రోజులను తెచ్చిందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పలేని పిరికివాళ్లుగా మారిపోయారని విమర్శించారు. ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారారని, నాయకులు, కార్యకర్తలు ఇంకా గులాబీ జెండాతోనే ఉన్నారని గుర్తుచేశారు. కుండ పగిలినా కుక్కబుద్ధి తెలిసినట్టు పార్టీలోని నకిలీల బుద్ధి బయటపడిందని, ఇప్పుడు పార్టీలో ఉన్నది అసలైన బీఆర్ఎస్ నాయకులని స్పష్టంచేశారు. దసరా తర్వాత భద్రాచలంలో భారీ సభ పెడదామని, రాముడి సాక్షిగా కాంగ్రెస్‌ను బొందపెడదామని పిలుపునిచ్చారు. తెలంగాణభవన్‌లో మంగళవా రం నిర్వహించిన భద్రాచలం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
ఏ పార్టీ అయిన రెండు పాత్రలు పోషిస్తది. అధికార పక్షం, ప్రతిపక్షం. కానీ, బీఆర్ఎస్ మూడు పాత్రలు పోషిస్తున్నది. 14 ఏండ్ల ఉద్యమ పార్టీగా, పదేండ్లు అధికార పార్టీగా పనిచేసినం. ఇప్పుడు 20 నెలలుగా విపక్ష పార్టీగా కొనసాగుతున్నం.
-కేటీఆర్
అచ్చంపేట ఎమ్మెల్యే వెళ్లిపోతే పోనియండి.. కేసీఆర్ వెంట మేమున్నం అని నాయకులు, కార్యకర్తలు చెప్తున్నరు. అదే స్ఫూర్తి ఇప్పుడు భద్రాచలంలో కనిపిస్తున్నది. ఐదు గంటల ప్రయాణం చేసి 200 మంది ఇంత దూరం వచ్చిండ్రంటే ఎంత ప్రేమ ఉండాలి. దసరా తర్వాత భద్రాచలంలో భారీ మీటింగ్ పెడుదాం. రాముడి సాక్షిగా కాంగ్రెస్‌ను బొంద పెడుదాం. 8-9 నెలల్లో భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తది. మనం గెలుస్తం. మీలో ఒకరు ఎమ్మెల్యే అవుతరు. మళ్లీ మంచిరోజులు వస్తయి.
– కేటీఆర్
కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో విఫలమయ్యామని కేటీఆర్ చెప్పారు. ‘మనం చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేకపోయినం. ఆ రోజే కాంగ్రెస్ దొంగ పార్టీ, మోసపు పార్టీ అని ప్రజలకు వివరిస్తే బాగుండేది. అనేక త్యాగాలు, ఉద్యమాలతో వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేయాలన్న ఏకైక లక్ష్యంతో రాష్ట్రంపైనే దృష్టి పెట్టినం తప్ప రాజకీయాలపై పెట్టలేదు. కాంగ్రెస్ ఇప్పుడు చేస్తున్న తీరుగా అప్పుడు ప్రతిపక్షాలను అణచివేసి ఉంటే, ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా ఎన్నికల్లో పోటీ చేయకపోవు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డిని కూడా ఏమీ చేయలేదు. చట్టప్రకారమే నడుచుకున్నం’ అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని నడిపించే సత్తా కాంగ్రెస్‌కు, రేవంత్‌కు లేదని, అందుకే ప్రతిసారీ పాత ప్రభుత్వంపై నెపం నెట్టేస్తున్నారని విమర్శించారు. తమ చేతగానితనాన్ని గతం చాటున దాచిపెడుతున్నారని దెప్పిపొడిచారు. కరోనా కాలంలో ఎలాంటి ఆదాయం లేకున్నా నాడు కేసీఆర్ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కటి కూడా ఆపలేదని గుర్తుచేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. అందరికీ వారిపై నమ్మకం పోయింది’ అని తేల్చి చెప్పారు.
‘ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్‌కు దమ్ముంటే, అవును, వారు మా కాంగ్రెస్‌లో చేరారు.. ఉప ఎన్నికలకు పోదామని చెప్పాలి’ అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. ‘పంచాయతీ, ఎంపీసీటీ, జడ్పీటీసీ ఎన్నికలు మొదలుకొని ప్రతి ఎన్నికను ఎదురోడానికి కాంగ్రెస్ వణికిపోతున్నది. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవు. కచ్చితంగా వారికి ఓటమి ఖాయం’ అని పునరుద్ఘాటించారు. ఫిరాయింపుల కారణంగా పార్టీలో కల్తీ పోయిందని, ఎవరేంటో తెలిసిందని, ఇప్పుడు పార్టీ మరింత బలంగా మారిందని తెలిపారు. ఆ ఎమ్మెల్యేలు తమపార్టీలోనే ఉన్నారని ముఖ్యమంత్రి, రాహుల్‌గాంధీకి కూడా చెప్పుకొనే దమ్ము లేదని ఎద్దేవాచేశారు. రాహుల్ గాంధీ పార్టీ ఫిరాయింపులు వద్దు అంటే, రేవంత్‌రెడ్డి మాత్రం పార్టీ ఫిరాయింపులు చేసి బయటకు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు.
గత దీపావళికి బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి అన్నారని, మళ్లీ దీపావళి వస్తున్నా పేలడం లేదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘సరిగ్గా ఏడాది క్రితం ఆయన ఇంట్లో జరిగిన ఈడీ దాడులపై ఈ బాంబులేటి ఎందుకు నోరు విప్పడం లేదు’ అని ప్రశ్నించారు. ‘తంతే గారెల బుట్టలో పడ్డట్టు, లకీ లాటరీలో మంత్రి అయిన పొంగులేటి కూడా పెద్దగా మాట్లాడుతున్నరు. ప్రజాస్వామ్యంలో అహంకారంతో ఎగిరితే ప్రజలు తిప్పికొడుతరు. ఆయన మళ్లీ పాలేరులో ఎలా గెలుస్తారో చూద్దాం. ఏడాది క్రితం పొంగులేటి ఇంటిపై జరిగిన ఈడీ దాడుల గురించి కేంద్రంగాని, ఆయనగాని ఎందుకు మాట్లాడటం లేదు. ఆ దాడుల్లో దొరికిన డబ్బులు ఎన్నో ఎవరూ చెప్పలేదు. మరి పొంగులేటి బీజేపీతో కుమ్మకయ్యాడా? లేదా బీజేపీతో కుమ్మకైన రేవంత్‌రెడ్డితో కలిసిపోయాడా?’ అని ప్రశ్నించారు. సీబీఐ సహా వంద కేంద్ర సంస్థలతో, బీజేపీతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మకైందని ఆరోపించారు. బతికినంత కాలం ధైర్యంగా బతకాలి తప్ప ఇంత నీచమైన కుమ్మకు రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలను, కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలను ఎదురొంటున్నది బీఆర్ఎస్యేనని కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీల ఏకైక లక్ష్యం తెలంగాణ గొంతుకైన బీఆర్ఎస్ను లేకుండా చేయడమేనని, కానీ తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ జెండా ఎగుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో పార్టీ ఎల్లకాలం బలంగా ఇలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రజల తరఫున కోట్లాడుతూనే ఉంటామని స్పష్టంచేశారు. ఎన్టీఆర్ తర్వాత ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి 25 ఏండ్లు పూర్తి చేసుకున్న ఏకైక తెలుగు నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. దగా పడ్డ తెలంగాణ కోసం తన జీవితాన్ని, ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. ‘రాముడి చరిత్రే మనకు ఆదర్శం.
వనవాసం అనంతరం పుణ్యపురుషుడు రాముడు పట్టాభిషిక్తుడయ్యాడు. మళ్లీ మనందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వంలోకి వస్తాం’ అని ధీమా వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి లాంటి నాయకులను చూసినప్పుడే కేసీఆర్ ఎంత గొప్పవారో అర్థమవుతుందని, చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందని పేర్కొన్నారు. సమవేశంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, సీనియర్ నేతలు నర్సింహమూర్తి, రాంప్రసాద్, రామకృష్ణ, సత్యం, రాంబాబు, తాతారావు, రాముడు, లక్ష్మి, సునీల్ పాల్గొన్నారు.
రెండేండ్లు కరోనా కాలంలో రాష్ర్టానికి దమ్మిడి ఆదాయం లేకున్నా ఒక్క సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఆపలేదు. వేతనాలు, పింఛన్లు, రైతుబంధు, కేసీఆర్ కిట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి అన్ని పథకాలు అమలు చేసినం. మనిషికి ఉండాల్సింది కండ కాదు..మానవత్వంతో స్పందించే గుండె.. అది కేసీఆర్‌కు ఉన్నది కాబట్టే కరోనా కష్టకాలంలోనూ సంక్షేమం ఆగలేదు.
-కేటీఆర్
ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్ వంటి చాలా మంది ముఖ్యమంత్రులను చూసిన. కానీ, రేవంత్‌రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలే. గుడ్లు పీకి గోటీలు ఆడుకుంటా అంటడు. పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటడు. సచివాలయంలో లంకెబిందెలు ఉన్నాయనుకున్న అంటడు.. నా దగ్గర పైసల్లేవు కోసుకుతింటరా అంటడు. ఆయనేమైనా సేపా.. జమకాయనా?
-కేటీఆర్
భద్రాచలంలో ఉప ఎన్నిక వస్తే తన యావదాస్తిని అమ్మి అయినా సరే అక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా అన్ని పనులూ వదులుకొని గెలిపించుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత నరసింహమూర్తి ప్రకటించారు. ‘యంగ్ లీడర్ కేటీఆర్‌ను కలవడం సంతోషంగా ఉన్నది. తెల్లం వెంకట్రావ్‌ను కట్టపడి గెలిపిస్తే ఆయన మూడు నెలలే పార్టీ మారిండు. నాపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నడు. కాంగ్రెస్ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు, కలెక్టర్ల కోసం మనం పింక్ బుక్ పెట్టాలి. కేసీఆర్ నాకు తండ్రితో సమానం. నా సంపాదన అంతా పార్టీకి ధారాదత్తం చేస్తా. భద్రాచలంలో పార్టీ అభ్యర్థిని గెలిపిస్తా’ అని స్పష్టంచేశారు. నరసింహమూర్తి భావోద్వేగంతో మాట్లాడిన మాటలపై కేటీఆర్ స్పందించారు. ‘మీ స్ఫూర్తికి, మీ మాటలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా’ అని తెలిపారు.