హైదరాబాద్: తెలంగాణవాసుల కాశీయాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ప్రమాదానికి (Bus Accident ) గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన శీలం దుర్పత్తిగా గుర్తించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయల్దేరింది. ఈ క్రమంలో యూపీలోని బృందావనం సమీపంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తం విస్తరించడంతో అది పూర్తిగా దగ్ధమైంది. దీంతో అందులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. కాగా, ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తున్నది. ప్రమాదాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో వారంతా అందులోనుంచి దిగిపోయారు. అయితే బస్సులో ఉండిపోయిన శీలం దుర్పత్తి మాత్రం మృతిచెందాడు. దీంతో అతని కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.