తాండూరు: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగ. పూల పండుగను ఆడబిడ్డలు సంబురంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఆడపడుచుకు ఉచితంగా చీరలను (Bathukamma Sarees) అందించింది. ఏటా బతుకమ్మ పండుగకు ముందు పంపిణీ చేసింది. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చీరల పంపిణీ నిలిచిపోయింది. అయితే తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో కుప్పలుకుప్పలుగా బతుకమ్మ చీరలు దర్శనమిచ్చాయి. గత ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా ఆడపడుచులకు పంపిణీ చేసేందుకు కేటాయించిన చీరలను.. పట్టణంలోని పాత రైతుబజారులో చీరల కట్టలను పడేశారు. వాటిని చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు. అయితే చీరలను అక్కడ ఎవరు వేశారనే విషయం తెలియరాలేదు.
తాండూరుతో సహా పలు ప్రాంతాల్లో చీరలను అందించని అధికారులు.. వాటినే తీసుకొచ్చి రైతుబజారులో వృథాగా పడేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చీరలను షెడ్లకు కట్టి ఊయలలా వాడుతున్నారు. వాటిని పేదలకు పంచి ఉంటే ప్రయోజనం ఉండేదని స్థానికులు అంటున్నారు. కాగా, రైతుబజారులో చీరలను ఎవరేశారో తమకు తెలియదని మున్సిపల్ అధికారులు అంటున్నారు.