HYDRAA | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులు, భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తిగా పడకేశాయి. దీనికితోడు హైడ్రా కూల్చివేతలతో బిల్డర్లు నిర్మాణాలను నిలిపివేయగా.. ఇండ్ల కొనుగోలుదారులు సైతం భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో నిర్మాణ రంగానికి సంబంధించిన పరిశ్రమల ఉనికి ప్రశ్నార్ధంగా మారింది.
ఇప్పటికే సిమెంట్, కంకర, రెడీమిక్స్ విక్రయాలు దాదాపు 50% మేరకు పడిపోవడంతో పలు పరిశ్రమలు తమ ఉత్పత్తులను నిలిపివేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణ రంగం ఉత్పత్తుల విక్రయాలు 40 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా సిమెంట్ విక్రయాల్లో గణనీయంగా తగ్గుదల నమోదు కావడంతో కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొవిడ్ సంక్షోభం నాటి పరిస్థితులు పునరావృతమయ్యాయని, 6 నెలలుగా పరిస్థితి ఘోరంగా మారిందని పరిశ్రమ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పదేండ్లపాటు తెలంగాణ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందడంతోపాటు, పలు జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకున్నది. భారీ నీటిపారుదల ప్రాజెక్టులతోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్మాణ కార్యకలాపాలు ఊపందుకోవడంతో ఇసుక, సిమెంట్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వమే లక్షల టన్నుల సిమెంట్‌ను కొనుగోలు చేసింది.
ఆ తర్వాత తెలంగాణలో ప్రభుత్వం మారడంతో అభివృద్ధికి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లను కూల్చివేస్తుండటం, నిర్మాణ అనుమతుల్లో విపరీతంగా అవినీతి పెరిగిపోవడంతో బిల్డర్లు తమ ప్రాజెక్టులను నిలిపివేశారు. మరోవైపు, కొనుగోలుదారులు సైతం ఏ భవనం సక్రమమో, ఏ భవనం అక్రమమో, ఏ భవనాన్ని ఎప్పుడు కూల్చివేస్తారో తెలియక తీవ్ర గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఇండ్ల విక్రయాలు అమాంతం పడిపోయాయి. దీంతో సిమెంట్ పరిశ్రమలు, స్టోన్ క్రషర్లు, ఇటుక బట్టీలు, రెడీమిక్స్ ప్లాంట్ల ఉనికి ప్రశ్నార్ధంగా మారింది. పనులు దొరక్క లక్షల మంది కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారు.
డిమాండ్ లేక టన్ను సిమెంట్ ధర రూ.వెయ్యికి క్షీణించిందని, దీంతో విక్రయాలు జూలైలో 40%, ఆగస్టులో 30 శాతానికిపైగా పడిపోయాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఉత్తర తెలంగాణలోని ఓ ప్రముఖ సిమెంట్ కంపెనీ జూలైలో 10 రోజులు, సెప్టెంబర్‌లో 12 రోజులపాటు ఉత్పత్తిని నిలిపివేసిందని, మిగిలిన కంపెనీలు సైతం తమ ఉత్పత్తులను 40% మేరకు తగ్గించుకున్నాయని చెప్తున్నారు.
రెడీమిక్స్ ప్లాంట్లు కూడా తమ కార్యకలాపాలు నిలిపివేశాయి. ప్రభుత్వంతోపాటు బిల్డర్ల నుంచి బిల్లులు రాకపోవడం, ప్రైవేటు బిల్డర్ల నుంచి కూడా గిరాకీ లేకపోవడంతో ఇప్పటికే పలు ప్లాంట్లను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఆర్ఎంసీ పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గత 3 నెలల్లో ఆర్ఎంసీ విక్రయాలు 40% మేరకు పడిపోయినట్టు తెలిపాయి.
నిర్మాణ రంగం సంక్షోభ ప్రభావం స్టోన్ క్రషర్లు, ఇటుక బట్టీలపై కూడా పడింది. రాష్ట్రంలోని దాదాపు 470 స్టోన్క్రషర్లలో ఇప్పటికే చాలా మూతబడినట్టు తెలుస్తున్నది. ఆర్డర్లు లేక కంకర, రోబో శాండ్ నిల్వలు పేరుకుపోవడం, గత 3 నెలల్లో విక్రయాలు 50 శాతానికిపైగా పడిపోవడం, కరెంటు బిల్లులు చెల్లించే పరిస్థితి లేకపోవడం ఇందుకు కారణమని స్పష్టమవుతున్నది. మిగిలిన క్రషర్లలోనూ తరచుగా ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్టు ఆ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, గత 3 నెలల్లో ఇటుకల విక్రయాలు కూడా 50% మేరకు పడిపోవడంతో ఇప్పటికే చాలా బట్టీలను మూసేసినట్టు వాటి యజమానులు తెలిపారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి తెలంగాణకు వచ్చే ఇటుక కూడా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రస్తుతం తమ వద్ద పేరుకుపోయిన నిల్వలను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.