B.Tech Student | పాఠాలు అర్థం కావట్లేదని మనస్తాపం చెందిన ఓ బీటెక్ స్టూడెంట్ దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హనుమకొండ జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన కృష్ణాకర్ చిన్న కుమార్తె జే.కీర్తన (19) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. అయితే కొంతకాలంగా లెక్చరర్లు చెప్పే పాఠాలు అర్థం కావడం లేదని ఒకవైపు.. తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకపోతున్నానని మరోవైపు కీర్తన బాధపడుతోంది. ఇదే విషయంలో తల్లిదండ్రులకు రోజు ఫోన్ చేసి బాధపడేది. కుమార్తె బాధ చూడలేని తల్లిదండ్రులు.. కీర్తనను వేరే కాలేజీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలోనే ఏమైందో తెలియదు గానీ.. దసరా పండక్కి ఇంటికొచ్చిన కీర్తన.. శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. కాసేపటికి ఇంటికొచ్చిన కృష్ణాకర్ ఇది గమనించి వెంటనే కీర్తనను ఆస్పత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఆస్పత్రిలో పరీక్షించిన వైద్యులు కీర్తన మృతిచెందినట్లుగా నిర్ధారించారు.