RS Praveen Kumar | వ్యవసాయ యూనివర్సిటీ : వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విరమించుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. తక్షణమే జీవో నెంబర్ 55ని విరమించుకోకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్ధులు 12 రోజులుగా చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ఆర్ఎస్ ప్రవీణ్ శనివారం మద్దతు ప్రకటించారు. ఇలాంటి కీలకమైన నిర్ణయాలు ఎవ్వరితో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు. జీవో నెంబర్ 55ను రద్దు చేసి తెలంగాణకు గుండెకాయ వంటి వర్సిటీని కాపాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఏళ్ల తరబడి సేంద్రీయ వృక్ష సంపద, 20 నుంచి 40 ఏళ్ల పైగా ఉన్న వాటిని నాశనం చేయడం కంటే మరొక నీచ సంస్కృతికి మరొకటి లేదని మండిపడ్డారు. ఈ చర్య వల్ల అరుదైన పక్షులు, జంతు, వృక్షజాతి ఉనికి ప్రశ్నార్థకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు తరాలను చేజేతులా నాశనం చేసినట్టు అవుతుందని అన్నారు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన మనమే రైతు మెడనొక్కినట్లవుతుందన్నారు. తరాల తరబడి పెంచిన మెడిషనల్ ప్లాంట్స్, విత్తన బండాగారాన్ని నాశనం చేసి చరిత్ర హీనులుగా మిగిలిపోవద్దని సూచించారు. అవసరమైతే బడా నేతలు గతంలో కబ్జా చేసిన కేబీ, ఇందిరా వంటి పార్కులలలో హైకోర్టు నిర్మించాలని ఆయన సవాళు విసిరారు. రాష్ర్టానికి మంచి చేయాలి తప్ప.. నాశనం చేయాలని చూస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులకు తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఇది రైతు రాజ్యమని చెప్పి.. రైతులకే ఎసరు పెట్టే పద్దతి మార్చుకోవాలని సూచించారు. అనంతరం ర్యాలీగా బయోడైవర్సిటీ పార్కుకు వెళ్లి అక్కడ మొక్కలు నాటారు.