BRSV | హైదరాబాద్ : నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్ను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజేష్ నాయక్ రూపొందించారు.
ఎన్నికల ముందు యువతను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన యూత్ డిక్లరేషన్, 420 హామీలు, జాబ్ క్యాలెండర్ వంటి హామీలు నేటికీ కేవలం కాగితపు ప్రకటనలగానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఉంచడమే ఈ ప్రచార పోస్టర్ లక్ష్యం. దాదాపు సంవత్సర కాలం గడుస్తున్నా ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిన ప్రభుత్వం ఈ రోజు నాటికి కూడా తన హామీలను అమలు చేయలేదని నేతలు విమర్శించారు.
ఈ పోస్టర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా కాంగ్రెస్ మేనిఫెస్టో, యూత్ డిక్లరేషన్, 420 హామీలు, అలాగే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క ఇచ్చిన హామీల వీడియోలు అన్నీ ఒకేచోట పొందుపరచడం జరిగింది. ఈ కోడ్ ద్వారా ప్రజలు నిజాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి, యువతను మోసం చేసిన తీరును గమనించి, తక్షణమే తమ హామీలను అమలు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పల్లా ప్రవీణ్ రెడ్డి, వల్లమల్ల కృష్ణా, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్, అలాగే బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. యువతను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు.