హైదరాబాద్ : బంకర్ బెడ్స్ కుంభకోణంపై CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. KGVB పాఠశాలల్లో బంకర్ బెడ్స్ కోసం జారీచేసిన టెండర్లలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్వీ ఆరోపిస్తోంది. సూత్రధారులపై CBI విచారణకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేసింది.
బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఇతర బీఆర్ఎస్వీ నాయకుల ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది. ఈ ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. గెల్లు శ్రీనివాస్‌ను, ఇతర నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రూ.100 కోట్ల కుంభకోణం జరిగిన తీరును వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ సర్వశిక్ష అభియాన్ పథకంలో భాగంగా KGVB కస్తుర్భా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు బంకర్ బెడ్స్ కొనుగోలు కోరు విద్యాశాఖ టెండర్ జారీచేసిందని చెప్పారు. కేసీఆర్ హయాంలో MSME లకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 100 కిలోల బరువుండే బెడ్స్‌కు ఒక్కోదానికి 12 వేల లెక్కన టెండర్లు పిలిచారని తెలిపారు.
ఇప్పుడు 75 కిలోల బరువుంటే బెడ్స్‌కు ఒక్కోదానికి రూ.33,446 చొప్పున టెండర్లు పిలిచారని ఆరోపించారు. మొత్తం 45 వేలకు పైగా బెడ్స్ అవసరం ఉన్నాయని, అంటే కొత్త టెండర్లతో దాదాపు రూ.100 కోట్లకుపైన ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని అన్నారు. అవినీతికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కొత్త టెండర్లు రద్దు చేసి స్థానిక MSMEలకు ఉపాధి కల్పించే విధంగా నాణ్యత కలిగిన బంకర్ బెడ్స్ పాఠశాలలకు అందేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని గెల్లు చెప్పారు.