హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: కేటీఆర్‌పై తప్పుడు వార్తా కథనాలు ప్రసారం చేస్తూ, అసభ్యకర థంబ్‌నెయిల్స్‌తో వీడియోలు పెట్టిన మహాన్యూస్ చానల్ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కేసులో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ సహా 14 మందికి బెయిల్ మంజూరైంది. ఈ ఘటనపై బీఆర్ఎస్వీ నేత లు, కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం సహా 9 సెక్షన్లను నమోదుచేసి, ఆదివారం నాంపల్లి క్రిమినల్కోర్ట్ జడ్జి నివాసంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కేసు విచారణ సందర్భంగా బెయిల్ మంజూరు చేయాలని బీఆర్ఎస్వీ నేతల తరఫున న్యాయవాది కోరారు.
పోలీసులు అభ్యంతరం తెలుపుతూ..అభియోగాలు ఎదుర్కొంటున్న వారికి రిమాండ్ విధించాలని, కస్టడీకి ఇవ్వాలని కో రారు. పోలీసుల అభ్యర్థనలను న్యాయమూర్తి తిరస్కరించారు. మొత్తం 14 మందికి బెయిల్ మంజూరు చేయడంతో విద్యార్థి విభాగం నేతలు విడుదలయ్యారు. విద్యార్థినేతల వెంట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్‌గౌడ్, శుభప్రద్‌పటేల్, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు గజ్జెల నగేశ్, ఆంజనేయులుగౌడ్, దూదిమెట్ల బాలరాజ్, పల్లె రవికుమార్ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నదని, కేసులకు భయపడకుండా ప్రజల తరఫున గొంతెత్తుతూనే ఉంటామని బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ నేతలంతా స్పష్టంచేశారు.
తోపులాట, ఉద్రిక్తతపై మరో కేసు
మహాన్యూస్ చానల్ వద్ద బీఆర్ఎస్ శ్రేణుల నిరసన కేసులో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ అరెస్ట్ శనివారం రాత్రి సందర్భంగా తెలంగాణభవన్‌లో చోటుచేసుకున్న ఉద్రిక్తతలపై కూడా బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు పెట్టారు. గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను అరెస్ట్ చేయకుండా తమ విధులకు ఆటంకం కలిగించారంటూ ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. వివరాల్లోకి వెళ్తే శనివారం రాత్రి 9గంటల సమయంలో తెలంగాణ భవన్‌లోకి పెద్దసంఖ్యలో పోలీసులు ప్రవేశించేందుకు యత్నించారు. అక్కడున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రతిఘటించారు. అనంతరం పోలీసులు గెల్లు శ్రీనివాస్‌ను బలవంతంగా అరెస్ట్ చేసి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ భవన్ వద్ద తమ విధులకు ఆటంకాలు కల్పించారంటూ బీఆర్ఎస్ సీనియర్‌నేత, శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, ఎమ్మెల్సీ తాతామధు, నేతలు అభిలాశ్‌రావు, పావనిగౌడ్, సునీత, పలువురు కార్యకర్తలపైనా బీఎన్ఎస్ 132, 292 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అద్దాలు పగిలితే హత్యాయత్నం కేసా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద అసత్యపు వార్తలు ప్రసారం చేయడంతో పాటు అత్యంత జుగుప్సాకరమైన థంబ్ నెయిల్స్ పెట్టిన మహాన్యూస్ చానల్ వద్ద బీఆర్ఎస్వీ కార్యకర్తలు నిర్వహించిన నిరసనలో ఆఫీస్ అద్దాలు పగిలితే హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గెల్లు శ్రీనివాస్‌ను ఆదివారం కలిసిన అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అనేక అరాచకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మహిళలను కించపర్చేలా, ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ ఉంటే రేవంత్‌రెడ్డి ఇంట్లోని మహిళలు కూడా ఆయనను తిరస్కరించే రోజు దగ్గర్లోనే ఉందని తెలిపారు. అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడేది ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. తెలంగాణ భవన్‌లోకి సెర్చ్‌వారెంట్ లేకుండా ప్రవేశించడమే కాకుండా అడ్డుకునేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటలు విని లెక్కకు మించి కేసులు నమోదు చేస్తున్న పోలీసులు తమ తీరును మార్చుకోకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.