Gellu Srinivas Yadav | బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ భవన్ వద్ద ఆయనను అరెస్టు చేయగా.. పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అనుమతి లేకుండా ప్రతిపక్ష కార్యాలయం లోపలికి ఎలా వస్తారని పోలీసులను నిలదీశారు. అయినా పోలీసులు వినిపించుకోకపోవడంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును ఎండగడుతూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
పోలీసులకు వ్యతిరేకంగా నేతలు నినదించారు. కేటీఆర్‌పై మహాన్యూస్ ఛానెల్ తప్పుడు వార్తలను ఎండగడుతూ శాంతియుతంగా బీఆర్ఎస్వీ శ్రేణులు నిరసన తెలుపుతుంటే.. బీఆర్ఎస్వీ కార్యకర్తలపై మహాన్యూస్ యాజమాన్యం, సిబ్బంది గుండాగిరి చేశారని.. దాడి చేసిన వారిని వదిలేసి బీఆర్ఎస్వీ శ్రేణులను పోలీసులు టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. మహాన్యూస్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్వీ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్, కేటీఆర్‌పై వ్యక్తిగతంగా మహాన్యూస్ దుష్ప్రచారం చేస్తుందని ఆయన మండిపడ్డారు. మహాన్యూస్ ఛానెల్ ముందు నిరసన తెలిపామని.. కేసీఆర్, కేటీఆర్‌పై అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్త వివిధ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నా.. కానీ, ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. వెంటనే మహాన్యూస్ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.