ఇల్లెందు, డిసెంబర్ 6: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన గురుకులబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శనకు వెళ్లిన బీఆర్ఎస్వీ నాయకులను అడ్డుకున్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎన్ఎన్ రాజు ఆధ్వర్యంలో జిల్లా మహిళా నాయకులు సింధు, తపస్విని లోపలికి వెళ్లనీయకపోవడంతో పాఠశాల గేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థులు అనారోగ్యం పాలై మృతిచెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కరించి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు గిన్నారపు రాజేశ్, సత్తాల హరికృష్ణ, రాహుల్ గౌడ్, అఖిల్, మహర్షి, వినయ్, ముఖేశ్, పుష్ప పాల్గొన్నారు.