జనగామ, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ‘కడియం శ్రీహరి..నీ నోరు కంపు కొడుతున్నది..శుభ్రం చేసుకో.. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం’ అంటూ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేకు బీఆర్ఎస్వీ నాయకులు హార్పిక్ లిక్విడ్, బ్రష్‌ను పంపించారు. సోమవారం జనగామలోని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు రావుల తిరుమల్‌రెడ్డి మాట్లాడారు. వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని మెచ్చుకుని అధికార పదవులు అనుభవించిన కడియం కోట్ల సంపాదనే ధ్యేయంగా అధికార పార్టీలోకి మారి తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే నోటికి అంటిన రాజకీయ అవినీతి కంపును హార్పిక్, బాత్రూమ్ కడిగే బ్రష్‌తో శుభ్రం చేసుకోవాలని హితవు పలికారు. గతంలో కేసీఆర్, కేటీఆర్‌ను పొగిడిన మాటలు ఇప్పుడు మర్చిపోయారా? అంటూ శ్రీహరి గతంలో కేటీఆర్ పనితీరుపై కురిపించిన ప్రశంసల వీడియోలను ప్రదర్శించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ఏమైనయ్..420 హామీల్లో ఏ ఒకటైనా అమలైందా? అంటూ నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల చెమట చుక్కలతో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కుర్చీలో కూర్చొని గులాబీ పార్టీపైన, నాయకులపై విషం చిమ్మడం అనైతికమని మండిపడ్డారు. ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ గెలువాలని సవాల్ చేశారు.
కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
‘తెలంగాణ కోసం పోరాడిన కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే విద్యార్థి విభాగం చూస్తూ ఉండదు..రాజకీయాల్లో విమర్శలు చేయండి..కానీ వ్యక్తిగత దూషణ చేస్తే ప్రతిస్పందన ఘాటుగానే ఉంటుంది’ అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే శ్రీహరిని బీఆర్ఎస్వీ జనగామ జిల్లా శాఖ హెచ్చరించింది. తెలంగాణ నిర్మాణం కోసం శ్రమించిన నేతలపై పిచ్చి ఆరోపణలు చేయడం కంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం ముఖ్యమని హితవు పలికారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయలేని దద్దమ్మలు ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరని చెప్పారు.