హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతకు ఈ ఎన్నికే కొలమానమని చెప్పారు. తెలంగాణభవన్‌లో మంగళవారం బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేత గౌతమ్యాదవ్ సహా పలువురు నాయకులు, బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలకు ఆమె గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్లడం తప్ప ఈ రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో కరెంటు కష్టాలు తొలగిపోతే, రేవంత్‌రెడ్డి పాలనలో మళ్లీ వచ్చాయని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకుంటేనే రాష్ట్ర ప్రగతి పట్టాలెకుతుందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతా గోపీనాథ్ భారీ మెజారిటీ సాధించేలా వారం రోజులు పార్టీ శ్రేణులు కష్టపడాలని పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్లీ మొదలవుతుందని బీఆర్ఎస్ నేత నగేశ్ముదిరాజ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పట్ల ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, అందరూ మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్లోకి వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో చేరికలు ఊపందుకోవడమే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను సూచిస్తున్నదని చెప్పారు.