హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : ‘ఉమ్మడి పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేస్తున్నది. ఈ ప్రాంతానికి దక్కాల్సిన సాగునీటిని యథేచ్ఛగా ఏపీ తరలించుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదు. సమైక్య పాలకుల దారిలోనే ఈ ప్రభుత్వం కూడా నడుస్తున్నది’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురుదక్షిణ చెల్లింపులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఉన్న పరీవాహక ప్రాంతంలో ప్రా జెక్టులు కట్టకుండా కాంగ్రెస్ ద్రోహం చేసిందని ఆయన ధ్వజమెత్తారు.
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు కంటే ముందు తాత్కాలిక ఒప్పందం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. దాని ప్రకారం పొందాల్సిన నీటిని కూడా తెలంగాణ వాడుకోలేక పోతుందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఏపీ తరలించుకుపోతుంటే, ఇక్కడి సీఎం రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటిపై సోయి ఉన్నదా? ఏపీకి నీళ్లను తరలించడమే సర్కార్ విధానమా? ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా ఏం లాభమని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో నోటి కాడికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని, ఇది ఎవరి బాధ్యత? అని నిలదీశారు.
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లి డ్రామా చేస్తున్నారని, చేతులు కాలాక ఆకు లు పట్టుకొన్న చందంగా వారి తీరు ఉన్నదని నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ధర్నా డ్రామాలు ఆపి, రైతులకు నీళ్లిచ్చే ఉపాయం ఆలోచించాలని హితవు పలికారు. వట్టెం పంప్‌హౌస్ మునిగినా పట్టించుకోని మంత్రులు శ్రీశైలం వద్ద ధర్నా చేస్తున్నారని విమర్శించారు. అసలు ధర్నా చేయాల్సింది శ్రీ శైలం వద్ద కాదని, సీఎం ఇంటి వద్ద అన్నారు.
ఎస్ఎల్బీసీ కూలి చనిపోయిన 8 మంది మృతదేహాలను వెలికి తీయలేని అసమర్థత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రస్తుతం జూరాల వద్ద నీళ్లే లేవన్నారని, కానీ, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రణాళిక ప్రకారం బ్యాక్‌వాటర్ ద్వారానే ఇప్పుడు మేలు జరుగుతుందని తెలిపారు. జూరాల ద్వారా నీరిచ్చే ప్రాజెక్టులకు కూడా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు వచ్చేలా కేసీఆర్ ప్రణాళిక వేసి, అమలు చేశారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఢిల్లీకి, పెండ్లిళ్లకు, ఇతర ఫంక్షన్లకు వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ, పాలమూరు రైతుల ప్రయోజనాలు పట్టించుకోవడం కోసం సమయం ఉండటం లేదా? అని ప్రశ్నించారు. పాలమూరులో 25 టీఎంసీల ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ కట్టలేక పోయిందని, అదే కేసీఆర్ 75 టీఎంసీల ప్రాజెక్టులను ఈ ప్రాంతంలో నిర్మించారని గుర్తుచేశారు. పంటలను కాపాడేందుకు చ ర్యలు తీసుకోవాలని, కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని తెప్పించి ఇక్కడి పంటలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.