హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ సర్కార్ భూ దందాలు.. కుంభకోణాలను ఆధారాలతో బయటపెడుతున్నందుకే నాపై కక్ష సాధిస్తున్నది.. కొంతకాలం కాళేశ్వరం.. ఇంకొంతకాలం తన ఆకారం.. ఇప్పుడు క్షుద్ర పూజల పేరిట దుష్ప్రచారానికి దిగుతున్నది’ అంటూ హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. స్వరాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి పేగులు తెగేదాకా కొట్లాడి జైలుకు పోయిన తన గురించి మాట్లాడే హక్కు ఉద్యమద్రోహి రేవంత్‌రెడ్డికి ఎక్కడిదని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు.
యనమల కాళ్ల దగ్గర పడి ఉండేవారు..
కేసీఆర్ ప్రాణాలను పణంగా పెట్టి కొట్లాడి తెలంగాణ సాధించినందునే రేవంత్‌రెడ్డి ఈ రోజు సీఎం సీట్లో కూర్చున్నారని లేదంటే యనమల రామకృష్ణుడు కాళ్ల దగ్గర పడి ఉండేవాడని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన దార్శనికుడని స్పష్టంచేశారు.
కాంగ్రెసోళ్లే రేవంత్ చరిత్ర చెప్పారు..
రేవంత్ చరిత్ర ఏందో.. ఆయన చేసిన దుర్మార్గాల గురించి స్వయంగా కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్‌రెడ్డి, చిన్నారెడ్డి, పోచారం బహిరంగంగానే చెప్పారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ‘దేవుడు కనబడితే భక్తితో దండం పెట్టుకోవడం నాకు మొదటినుంచి అలవాటు.. కానీ దేవుడి పేరిట చిల్లర రాజకీయం చేయడం.. ఒట్లు పెట్టుకొని మోసం చేయడం రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య’ అని విమర్శించారు. ‘నేను ఆధ్యాత్మిక భావనతో తమిళనాడులోని తిరుచ్చిలో రంగనాథస్వామి ఆలయానికి వెళ్లిన.. తిరుపతిలో మెట్ల మార్గం ద్వారా వేంకటేశుడిని దర్శించుకున్న..శ్రీశైలానికి కూడా ఎన్నోసార్లు వెళ్లిన.. అలాగే కర్ణాటకలోని కొల్లూరు మూకాంబిక ఆమ్మవారి దర్శనం కోసం శివమొగ్గ ఎయిర్‌పోర్టుకు వెళ్లిన.. అక్కడ ఇంటెలిజెన్స్ అధికారులు, పోలీసులు నాతో ఫొటోలు దిగారు.. సమస్యలు ఏకరువుపెట్టారు.. కానీ సీఎం మాత్రం సిగ్గులేకుండా ఏవో పూజలు చేసినట్టు ఆరోపిస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి దిక్కుమాలిన రాజకీయం బంద్‌పెట్టి ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు.
నాపై 370 ఉద్యమ కేసులు..
తనపై చిల్లరగా మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని నిలదీశారు. ‘నాపై 370 కేసులు ఉన్నాయి.. మెదక్ జైలులో ఉన్న.. రైల్‌రోకోలో భాగంగా 48గంటలు కంకర రాళ్లపై పడుకున్నా.. ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలా భావించి విసిరికొట్టిన. ఈత రాకున్నా మిలియన్ మార్చ్ సమయంలో తెలంగాణ కోసం సాగర్‌లో దూకిన.. మానుకోటలో బుల్లెట్లు పడుతుంటే రక్తపు మడుగులో ఉన్నవారిని భుజాలపై ఎత్తుకొని దవాఖానకు పరుగెత్తిన.. ఓయూలో పెల్లెట్లు పడుతుంటే ధైర్యంగా ముందుకు నడిచిన. ఉద్యమ సమయంలో వందల సార్లు ఢిల్లీ హైకోర్టు చుట్టూ తిరిగిన చరిత్ర నాది.. ఏడుసార్లు సిద్దిపేట నుంచి ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేసి లక్షకుపైగా మెజారిటీ సాధించి చరిత్ర తిరగరాసిన’ అని వివరించారు. పొద్దునలేస్తే తనపై చిల్లరగా మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదని స్పష్టంచేశారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.