న్యూఢిల్లీ: చెక్కర ధరలు ఇటీవల ఆకాశాన్ని అంటిన విషయం తెలిసిందే. అయితే పండుగ సీజన్ రాబోతున్న తరుణంలో.. కేంద్ర సర్కారు కొత్త ఆదేశాలు జారీ చేసింది. చెక్కర డీలర్ల తమ వద్ద నిల్వల(Sugar Stock)ను 15 రోజులకు మించి ఉంచకూడాదని తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇక స్టాక్ హోల్డింగ్ పరిమితిని 1000 క్వింటాళ్లకు పెంచింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ కొత్త నిబంధన అమలులోకి రానున్నట్లు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వశాఖ పేర్కొన్నది. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి.
చెక్కరను నిల్వ చేసే అంశంలో కోల్‌కతాతో పాటు అస్సాంలో ఎటువంటి ఆంక్షలను విధించలేదు. కొత్త నిబందనల ప్రకారం చెక్కర డీలర్లు తమ వద్ద స్టాక్‌ను 15 రోజుల్లోనే క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇక చెక్కర స్టాక్ కూడా వెయ్యి క్వింటాళ్లు దాటవద్దు అని ప్రకటనలో తెలిపారు. కోల్‌కతాతో పాటు అస్సాం వ్యాపారులకు మాత్రం 2000 క్వింటాళ్ల వరకు చెక్కర నిల్వ చేసుకునే వెసలుబాటు కల్పించారు. యూపీ, మహారాష్ట్ర, కర్నాటక నుంచి కోల్‌కతాకు చెక్కర సరఫరా అవుతుంది. ఇక అక్కడ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తారు. అయితే భౌగోళిక పరిస్థితులు, లాజిస్టిక్స్ ఆంక్షల దృష్ట్యా అస్సాంలో అధిక నిల్వలకు అవకాశం కల్పించారు.