బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రాంగణంలో ఉర్దూ ఉత్సవం నిర్వహించాలన్న ప్రతిపాదనపై వివాదం చెలరేగింది. బీజేపీతో పాటు కన్నడ అనుకూల సంస్థలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. అయితే విధానసౌధ ప్రాంగణంలో భాషా ఉత్సవాలు జరుపుకోవాలన్న ఆలోచనను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించింది. (Karnataka Assembly) సెప్టెంబర్ 9న ఉర్దూ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఊర్దూ ఉత్సవం నిర్వహించాలని తమ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు మంత్రి యూటీ ఖాదర్ గురువారం తెలిపారు. భాష, సంస్కృతిపై మరింత అవగాహన కల్పించడమే ఈ వేదిక ఏర్పాటు లక్ష్యమని చెప్పారు. ఎలాంటి వివాదం సృష్టించడం దీని ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, వార్షిక ఉర్దూ సాహిత్య పురస్కారాన్ని గతంలో ఒక హాలులో ప్రదానం చేసేవారని మంత్రి ఖాదర్ తెలిపారు. అయితే ఈ కార్యక్రమాన్ని బహిరంగ ప్రదేశంలో నిర్వహించాలని తాను ప్రణాళిక వేసినట్లు ఆయన చెప్పారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న వారు ఈ కార్యక్రమం వెనుక ఉద్దేశ్యాన్ని గాని, భాషను గానీ అర్థం చేసుకోలేకపోయి ఉండవచ్చని మంత్రి అన్నారు.
అయితే అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమం వల్ల ఏవైనా సమస్యలు తలెత్తితే వేదిక మార్పును పునఃపరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి యూటీ ఖాదర్ తెలిపారు.
తుది నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం అన్ని వర్గాలతోనూ సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. ప్రతిపాదిత వేదిక అనేది ప్రతిష్టకు సంబంధించిన విషయం కాదని స్పష్టం చేశారు. మైనారిటీ ప్రజల ప్రసన్నం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా వస్తున్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.