Kubheer | కుభీర్: ‘స్వచ్ఛతా హీ సేవ (Swachhata Hi Seva)’ కార్యక్రమాన్ని మండల కేంద్రం కుభీర్లోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గ్రామ సర్పంచ్ కందూరి సాయినాథ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చెత్త వేరు చేసే విధానం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త ఇలా నాలుగు రకాలుగా వేరు చేయాలని అన్నారు. ప్రతి ఇంట్లో చెత్తను సేకరించి, ప్రత్యేక డస్ట్బిన్లలో వేసి చెత్త సేకరణకు వచ్చే గ్రామపంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందజేయాలని సూచించారు.
చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఇంటి పరిసరాలను, వీధులను పరిశుభ్రంగా ఉంచుకుంటే పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా చెత్త వేస్తే పంచాయతీరాజ్ నిబంధనల ప్రకారం జరిమానా (Fine) విధించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల చుట్టూ, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రజలందరూ గ్రామపంచాయతీకి సహకరించాలని కోరారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పరిశుభ్రతపై అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో స్వచ్ఛమైన గ్రామ నిర్మాణానికి బాటలు వేయవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రతి తరగతి గదికి డస్ట్బిన్లను అందజేశారు. విద్యార్థులు చెత్తను వేరు చేసి సరైన విధంగా పారవేయాలని ఉపాధ్యాయులు సూచించారు.