Defected MLAs Case | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ వారు ఫిరాయింపులకు పాల్పడలేదంటూ స్పీకర్ (ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో) ఇచ్చిన తీర్పు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన ఏడు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరుపనున్నది. పార్టీ ఫిరాయించిన టీ ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడి యం శ్రీహరి, గూడెం మహిపాల్‌రెడ్డి, సంజయ్‌కుమార్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ ఇటీవల స్పీకర్ తీర్పు చెప్పడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతున్నది. స్పీకర్ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమని, చట్ట విరుద్ధమని ప్రకటించాలని తమ పిటిషన్లలో కోరింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, కేపీ వివేకానంద, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, టీ జగదీశ్‌రెడ్డి ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలో ఏడు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ బుధవారం విచారణ చేపట్టనున్నది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌కుమార్‌పై దాఖలైన పిటిషన్లు గురువారం విచారణ కు వచ్చే అవకాశమున్నది.
బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో ఖైరతాబా ద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని హైకోర్టును కోరారు. అనర్హత పిటిషన్‌ను స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తి రసరించడాన్ని ఆయన సవాల్ చేశారు. స్పీ కర్ ఈ నెల 11న ఇచ్చిన తీర్పు చట్టవిరుద్ధం, పక్షపాతంతో కూడిందని ప్రకటించాలని కోరా రు. ‘2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై ఎన్నికైన దానం నాగేందర్, 2024 మార్చి 15న కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీచేశా రు. దానం ఇలా చేయడం తన శాసనసభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టుగా పరిగణించాలి. స్పీకర్ ట్రిబ్యునల్ ఎదుట అనర్హత పిటిషన్ విచారణ సందర్భంగా.. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో దానం నాగేందర్ పేరు ఉండటాన్ని ఆ ధారాలతో చూపించినప్పటికీ పట్టించుకోకపోవడం దారుణం, రాజ్యాంగ వ్యతిరేకం.
ఫా రం-26లో కాంగ్రెస్ అభ్యర్థిగా వివరాలు ఇ వ్వడం వంటి అంశాలను అదనపు అఫిడవిట్ ద్వారా స్పీకర్‌కు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోయింది. దానం నాగేందర్ కాంగ్రెస్ పా ర్టీలో చేరినప్పుడు టీవీలు, పత్రికల్లో ప్రముఖం గా వార్తలు వచ్చాయి. ఆయన కాంగ్రెస్ కండు వా కప్పుకొన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారు. దానం సోషల్ మీడియా పోస్టులు, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు, మీడియా ఇంటర్వ్యూలు.. ఇలా మొత్తం 30 డాక్యుమెంట్లను స్పీకర్‌కు నివేదించినప్పటికీ పట్టించుకోలేదు. ఆది నుంచీ స్పీక ర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పిటిషన్ల విచారణను జాప్యం చేయడంపై హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాల్సివచ్చింది. 2025 జూలై 31న సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ విచారణ సందర్భంగా దానం నాగేందర్ తన వాదనలతో దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌ను పరిశీలిస్తే కీలక తప్పిదాలు కనిపిస్తాయి. తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేద ని, బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను తొలగించలేదని, అసెంబ్లీ వెలుపల జరిగిన తన వ్యక్తిగత చర్యలు పదో షెడ్యూల్ పరిధిలోకి రావని దా నం చేసిన వాదన రాజ్యాంగ వ్యతిరేకమని ప్ర కటించాలి.
ఇన్ని ఆధారాలు చూపినప్పటికీ వే టినీ పట్టించుకోకుండా పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ ట్రిబ్యునల్ 2026 మార్చి 11న తీర్పు ఇచ్చింది. దానం నాగేందర్ చర్యలు అసెంబ్లీ వెలుపల జరిగినవి కాబట్టి అవి శాసనసభ కా ర్యకలాపాలకు నేరుగా సంబంధించవని స్పీ కర్ తేల్చడం చట్టవ్యతిరేకమే కాకుండా రా జ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూనే అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీఫాంతో లోక్‌సభకు పోటీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలి. ఇందుకు సాక్ష్యాలు కూడా అవసరం లేదు. స్పీ కర్ ఇచ్చిన తీర్పును రద్దు చేయాలి. వాస్తవాని కి ట్రిబ్యునల్ విచారణలో సమాన అవకాశాలు కల్పించలేదు. పిటిషనర్‌కు చాలా తకువ సమయం ఇచ్చింది. దానం నాగేందర్‌కు ఎకువ సమయం ఇచ్చింది. విచారణలో పక్షపాతం స్పష్టంగా కనిపించింది. ట్రిబ్యునల్ నిర్ణయంలో చట్టపరమైన లోపాలున్నాయి. పదో షెడ్యూల్ నిబంధనలను తప్పుగా అర్థం చేసుకుని తీర్పు ఇచ్చింది. ఒక ఎమ్మెల్యే మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే అది స్వచ్ఛందంగా శాసనసభ్యత్వాన్ని వదిలినట్టేనని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. ఈ తీర్పులను ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఖాతరు చేయలేదు. ఈ నేపథ్యంలో స్పీకర్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలి. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలి’ అని కౌశిక్ రెడ్డి తన పిటిషన్లో హైకోర్టును కోరారు.
‘కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకటరావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ పరిగణనలోకి తీసుకోలేదు. తాము సమర్పించిన ఆధారాలను పరిశీలించకుండానే స్పీకర్ తమ పిటిషన్లను కొట్టివేశారు. ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోలేదు. స్పీకర్ తీర్పు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లో పేరొన్న నిబంధనలకు విరుద్ధం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని కోరే అర్హత ఓటరుకు ఉంటుందని, ఎమ్మెల్యేలకు లేదని స్పీకర్ వెలువరించిన తీర్పులో పేరొనడం రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవిరుద్ధం. పదో షెడ్యూలులోని నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు కూడా అనర్హత పిటిషన్ దాఖలు చేయవచ్చు. అనర్హత పిటిషన్లు దాఖలు చేశాక జరిగిన పరిణామాలను కూడా స్పీకర్ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ విషయాన్ని కూడా స్పీకర్ విస్మరించారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినవారిపై అనర్హత వేటు వేసేందుకు అవసరమైన ఎన్నో ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ పట్టించుకోలేదు. స్పీకర్ ఇచ్చిన తీర్పులను రద్దు చేయాలి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పిటిషన్లలో విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఫిరాయింపు ఎమ్మెల్యేలను, ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ల తరఫున న్యాయవాది శ్రీపతి సంతోష్‌కుమార్ వాదించనున్నారు.