KTR | హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పేదల పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు కనికరమే లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఎందరో పేదలు నిర్మించుకున్న ఇండ్లను హైడ్రా పేరుతో అత్యంత కర్కశంగా కూల్చివేస్తున్నదంటూ ఆయన ఎక్స్ వేదికగా ఆదివారం పోస్టు చేశారు. హైడ్రా ఇండ్లు కూల్చిన తర్వాత.. నిరాశ్రయులైన పేద లు జోరు వానలో పట్టాలు అడ్డుపెట్టుకొ ని కన్నీటిపర్యంతమవుతున్న వీడియోను ఆ పోస్టుకు జత చేశారు. ఆ పోస్టుకు వేలాదిగా వ్యూస్, పాజిటివ్ కామెంట్లతో విశేష స్పందన వస్తున్నది.
కనికరం లేకుండా కర్కశంగా నిరుపేదలు నివాసముండే ఇండ్లను ఇవ్వాళ రేవంత్ సరార్ కూల్చివేస్తే.. ఆ అభాగ్యులు దికుతోచక ప్లాస్టిక్ కవర్ల నీడలో తలదాచుకుంటున్నారని తెలిపారు. పేరుకేమో ప్రజా ప్రభుత్వం.. కూల్చేదేమో నిరుపేదల ఇండ్లు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సుమారు 40,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్‌లో పేదలకు కేటాయించేందుకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ ఇండ్లను వెం టనే నిరుపేదలకు కేటాయించాలని దయ తో వేడుకుంటున్నట్టు సీఎస్‌ను కోరారు. మానవీయ దృక్పథంతో పునరావాస విధానంతో ముందుకురావాలని, పౌరులందరికీ చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించి ఇండ్లు కేటాయించండి’ అంటూ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. తన పోస్టును తెలంగాణ సీఎస్‌కు ట్యాగ్ చేశారు.