KTR | హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ నేతలు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితా సవరణను వెంటనే వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదల దృష్ట్యా ఓటర్ల జాబితా సవరణ వాయిదా వేయాలని కోరారు. వరద పరిస్థితుల్లో ప్రజలు ఓటరు జాబితాలను చూడలేరని పేర్కొన్నారు. ప్రజలు, అధికారులు సవరణ ప్రక్రియలో పాల్గొనడం అసాధ్యమని తెలిపారు. పారదర్శక వాతావరణంలో మరోసారి సవరణ ప్రక్రియ చేపట్టాలని కోరారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నోటిఫై చేయబడిన అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
అయితే ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ చేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని జారీ చేసిన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేస్తారని ఎన్నికల సంఘం తెలిపింది.