హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): నీటి సమస్యను పరిష్కరించే చేవలేక, చేతగాక ఆ నెపాన్ని వర్షపాతంపైకి నెట్టేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విరుచుకుపడ్డారు. నిరుడు లోటు వర్షపాతం నమోదుకావడంతో రిజర్వాయర్లలో నీటి నిల్వలు పడిపోతున్నాయని, ప్రజలు అర్థం చేసుకోవాలన్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. భారత వాతావరణశాఖ లెక్కల ప్రకారం 2023-24లో సాధారణం కన్నా 14శాతం అధిక వర్షపాతం నమోదైందని గుర్తు చేశారు. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అసత్యాలు మాట్లాడుతున్నదని, కాంగ్రెస్ తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. రైతు సమస్యలు తీర్చడం మాట అటుంచితే, తెలంగాణ రైతాంగానికి మూడు నెలల్లోనే స్కాంగ్రెస్ చేతగానితనం పూర్తిగా అర్థమైందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో నిరుడు లోటు వర్షపాతం నమోదైందన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని గణాంకాలు చెప్తున్నాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీసీ)ప్రకారం.. నిరుడు నైరుతి రుతుపవనాల కారణంగా 17శాతం అధికంగా వానలు పడ్డాయి. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 73.8 సెంటీమీటర్లుకాగా నిరుడు జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 మధ్య 86.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తం 33 జిల్లాలకుగానూ 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా, 18 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలవారీగా చూస్తే సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సాధారణం కన్నా 45శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో మాత్రం 16 శాతం లోటు నమోదైంది. మొత్తంగా ఐదు జిల్లాల్లో మాత్రమే సగటున 11 శాతం మేర లోటు వర్షపాతం కనిపించింది.
నిరుడు జూన్ 1వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 7వ తేదీ వరకు లెక్కించినా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువే నమోదైందని గణాంకాలు చెప్తున్నాయి. ఈ కాలంలో సాధారణ వర్షపాతం 86.6 సెంటీమీటర్లు కాగా, 91.4 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అంటే సాధారణం కంటే 6 శాతం అధికం. మొత్తంగా జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ మినహా రాష్ట్రంలోని మిగతా 31 జిల్లాల్లో సాధారణం లేదా, అంతకన్నా ఎక్కువ వర్షాలు పడినట్టు నివేదిక స్పష్టం చేస్తున్నది. ఇందులో 6 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. దీనిని బట్టి సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్నవన్నీ అబద్ధాలేనని, నీటి సమస్యను పరిష్కరించలేక వానలపై నిందలు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.