KTR | పూర్వ వైభవం కోల్పోయిన వరంగల్‌కు మళ్లీ టెక్స్టైల్ హబ్ గుర్తింపు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ బీఆర్ఎస్ నేతలతో కలిసి బుధవారం కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. అనంతరం కేఎంటీపీ ప్రస్తుత పరిస్థితిని, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ప్రస్తుత పరిస్థితి కేసీఆర్ దూరదృష్టికి నిదర్శనంగా చెప్పవచ్చన్నారు. ఒకనాడు ఓరుగల్లు జిల్లా అంటేనే అజంజాహీ మిల్లుకు, ఇక్కడ పండే బ్రహ్మాండమైన పత్తికి ఆలంబనగా నిలిచి, చుట్టుపక్కల జిల్లాల నేతన్నలకు ఉపాధి కల్పించిన ప్రాంతమన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ జిల్లా తన పూర్వ వైభవాన్ని కోల్పోయి, నేతన్నలు సూరత్, షోలాపూర్, భీవండి వంటి ప్రాంతాలకు వలసపోయే దుస్థితి ఏర్పడిందని.. ఈ పరిస్థితిని మార్చి, వరంగల్‌ను ఒక సూరత్ లాగా, తమిళనాడులోని తిరుపూర్ లాగా టెక్స్టైల్ హబ్‌గా మార్చాలనే ఉద్దేశంతో ‘ఫామ్ టు ఫ్యాషన్’ .. అంటే నల్లరేగడి నేలల్లో పండే తెల్ల బంగారం (పత్తి) తో రైతుకు, పరిశ్రమలో పనిచేసే మహిళలకు ఉపాధి దొరకాలనే సంకల్పంతో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కును ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.

సరిగ్గా ఎనిమిది ఏళ్ల కిందట, 2017 అక్టోబర్ 22 రోజున కేసీఆర్ ఇదే ప్రాంగణంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేశారని, మధ్యలో కరోనా కారణంగా రెండేళ్లు ఇబ్బంది కలిగినా.. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే కైటెక్స్, యంగ్వన్, గణేశాలాంటి పరిశ్రమలు దాదాపు 25-30 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోవడం సంతోషదాయకమన్నారు. మేము కిటెక్స్ పరిశ్రమను సందర్శించి, అందులోని అత్యాధునిక స్పిన్నింగ్, గార్మెంటింగ్ పరిశ్రమలను పరిశీలించడం జరిగిందని, దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ సంస్థకు కూడా పెద్ద ఎత్తున భూమిని కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న ధర్మా రెడ్డి రైతులను ఒప్పించి, ఉపాధి అవకాశాల గురించి వివరించి, బతిమిలాడి భూసేకరణ చేశారని, ఆ కల సాకారమై పరిశ్రమలు వచ్చి 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ పార్కును ప్రారంభించిన నాడు భారతదేశంలో ఇలాంటి పాలసీ కూడా లేదని.. పక్కన ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో వస్త్ర ఉత్పత్తి భారతదేశం (4శాతం) కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉందని.. మన తెలంగాణను టెక్స్టైల్ హబ్‌గా మార్చాలనే విజన్‌తో ఈ పార్కును ఏర్పాటు చేశామన్నారు.

ఈ రోజు ఈ రెండు మూడు పరిశ్రమలు తొందరగా ఉత్పత్తి పూర్తి చేసి, పూర్తి స్థాయిలో విస్తరిస్తే 30-40 వేల మందికి ప్రత్యక్షంగా, రెట్టింపు పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయే అవకాశం ఉందన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను ప్రారంభించిన తదనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి స్ఫూర్తి పొంది.. పీఎం మిత్ర అనే స్కీమ్‌ను నాలుగు సంవత్సరాల తర్వాత తీసుకొచ్చిందని.. ‘తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది’ (What Telangana does today, India does tomorrow) అనే పద్ధతి’లో మనం పెట్టిన ఈ పార్క్ భారతదేశానికి ఆదర్శంగా నిలబడడం చాలా సంతోషంగా ఉందన్నారు. గవర్నమెంట్లు, పార్టీలు మారవచ్చు గాక, కానీ రాష్ట్రం శాశ్వతం, రాష్ట్ర ప్రయోజనం శాశ్వతమని చెప్పారు. ప్రజలకు ఉపాధి కల్పించే ఇలాంటి దీర్ఘకాలిక కార్యక్రమాలు శాశ్వతమని.. కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నానన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ ఇచ్చిన ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు (KMTP) ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కోరారు.

అయితే, ఇంకా కొన్ని పనులు పెండింగ్‌లో కనిపిస్తున్నాయని.. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన ఫ్లైఓవర్ (ఆర్వోబీ) పనులను పూర్తి చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. పార్క్ లోపల డ్రైనేజ్, సివరేజ్ సిస్టమ్, కామన్ ఫెసిలిటీస్ పనులు మందకొడిగా నడుస్తున్నాయని.. వాటిని కూడా పూర్తి చేయాలని కోరుతున్నానన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా ఉపాధి అవకాశాల విషయంలో చొరవ తీసుకోవాలని.. స్థానికులకే ఉద్యోగాలు దొరికే విధంగా కేసీఆర్ రూపకల్పన చేసిన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. దానికి మా పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు మా సహకారం అందిస్తామని.. కేసీఆర్ విజన్‌కు, దార్శనికతకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు కేటీఆర్.